పర్యావరణ రక్షణకు కట్టుబడి ఉన్నాం

18 Feb, 2020 03:09 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ/గాంధీనగర్‌: పర్యావరణానికి హాని కలగని రీతిలో సుస్థిర, సంతులిత అభివృద్ధి సాధించడం భారత్‌ అవలంబిస్తున్న విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలో పెరుగుదల 2 డిగ్రీల సెల్సియల్‌ లోపే ఉండాలన్న పారిస్‌ పర్యావరణ ఒప్పందాన్ని అమలు చేస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్‌ ఒకటని గుర్తు చేశారు. వన్య వలస జాతుల పరిరక్షణపై గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న 13వ ‘‘కాన్ఫెరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(సీఓపీ–13) ఆఫ్‌ ద కన్వెన్షన్‌ ఆన్‌ ది కన్సర్వేషన్‌ ఆఫ్‌ మైగ్రేటరీ స్పీషీస్‌ ఆఫ్‌ వైల్డ్‌ ఎనిమల్స్‌(సీఎంఎస్‌)’’ని ఉద్దేశించి ప్రధాని మోదీ సోమవారం వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, సమతుల్య జీవన విధానం, గ్రీన్‌ డెవలప్‌మెంట్‌.. తదితర విలువలతో కూడిన కార్యాచరణతో వాతావరణ మార్పుపై భారత్‌ పోరాడుతోందని మోదీ తెలిపారు.

‘సంతులిత అభివృద్ధిని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. పర్యావరణానికి హాని చేయకుండానే అభివృద్ధి సాధ్యమని మేం నిరూపిస్తున్నాం’ అన్నారు. ‘వలస జాతులు ఈ భూగ్రహాన్ని అనుసంధానిస్తాయి. మనం ఉమ్మడిగా వాటికి ఆహ్వానం పలుకుదాం’ అని సీఓపీ–13కి స్లోగన్‌ థీమ్‌గా పెట్టారు. కన్వెన్షన్‌ అధ్యక్ష బాధ్యతలను వచ్చే మూడేళ్లు భారత్‌ నిర్వహించనుందని ప్రధాని వెల్లడించారు. వలస పక్షుల పరిరక్షణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పర్యావరణ మంత్రి జవదేకర్‌ అన్నారు.

జనాభా తగ్గుతోంది 
అంతరించే ప్రమాదంలో ఉన్న వన్య వలస జాతుల్లో అత్యధిక శాతం జాతుల జనాభా గణనీయంగా తగ్గుతోందని ‘13వ సీఎంఎస్‌ సీఓపీ’  ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రాథమిక అంచనాయేనని, పూర్తిగా నిర్ధారణ చేసేందుకు సహకారంఅవసరమని సీఎంఎస్‌ కార్యనిర్వాహక కార్యదర్శి అమీ ఫ్రేంకెల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు