శబరిమలలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ అసాధ్యం

4 Sep, 2018 02:51 IST|Sakshi

తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్పస్వామి దర్శనానికి ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం ప్రారంభించటం ఆచరణ సాధ్యం కాదని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంబ వద్ద రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో భక్తులను నియంత్రించేందుకు తిరుమల తరహాలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ పద్ధతిని అమలు చేయాలని పోలీస్‌ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి. శబరిమలలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తిరుమల మోడల్‌ను అమలు చేయటం అసాధ్యమని టీడీబీ అధ్యక్షుడు పద్మకుమార్‌ స్పష్టంచేశారు.

ఆఖరి మకరవిలక్కు సీజన్‌లో రోజుకు 4 లక్షల మంది భక్తులు వస్తారని, అలాంటప్పుడు 20 వేల నుంచి 30 వేల మందినే అనుమతించటం ఎలా సాధ్యమని ఎదురు ప్రశ్నించారు. శబరిమలవిషయంలో టీడీజీ నిర్ణయమే అంతిమమని తేల్చి చెప్పారు. అయితే సౌకర్యవంతమైన దర్శనం కోసం ఎవరైనా ఆమోదయోగ్యమైన సిఫార్సులు చేస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పంబ వద్ద మౌలిక వసతుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పంబపై ‘అయ్యప్ప సేతు’పేరుతో టీడీబీ తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించింది.

ఇటీవలి వరదల్లో నీట మునిగిన పంబ–త్రివేణి బ్రిడ్జిని ఆదివారం పునరుద్ధరించింది. నవంబర్‌ నుంచి మకరవిలక్కు సీజన్‌ ప్రారంభంకానున్న దృష్ట్యా పంబ వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పనుల సమన్వయంపై సీనియర్‌ ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాన్ని నియమించాలని యోచిస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా