సీబీఐ ఉనికి ప్రశ్నార్థకం?

9 Nov, 2013 01:15 IST|Sakshi
సీబీఐ ఉనికి ప్రశ్నార్థకం?

గౌహతి హైకోర్టు తీర్పుతో ప్రకంపనలు

 కేంద్ర ప్రభుత్వం, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ
 తీర్పుపై నేడే సుప్రీంలో పిటిషన్ వేస్తామని కేంద్రం వెల్లడి
 ప్రధాని మన్మోహన్‌తో సమావేశమైన మంత్రి నారాయణస్వామి
 2జీ కేసులో సీబీఐ విచారణ ఆపేయాలన్న న్యాయవాదులు


 
సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు సీబీఐని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. 2జీ కుంభకోణం వంటి కీలక కేసులపైనా ఈ తీర్పు ప్రభావం పడింది. సీబీఐ సంస్థే రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు ఇక ఆ విభాగం చేస్తున్న దర్యాప్తునకు విలువ లేదంటూ కోర్టుల్లో న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ తీర్పుతో సీబీఐ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. తీర్పుపై స్టే విధించాలంటూ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది.
 
 ప్రభుత్వ పెద్దల్లో చర్చలే చర్చలు..
 
 సీబీఐ తన మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉండడంతో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి వి.నారాయణస్వామి శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి కోర్టు తీర్పుపై చర్చించారు. తర్వాత పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాతోపాటు న్యాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్  కూడా మంత్రి నారాయణస్వామితో సమావేశమై తీర్పు విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. సుప్రీంలో దాఖలు చేయబోయే పిటిషన్‌కు రూపకల్పన చేసిన అనంతరం రంజిత్ సిన్హా.. అటార్నీ జనరల్ జీఈ వాహనవతితో భేటీ అయ్యారు. కేంద్రం శనివారమే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తుందని, సోమవారం విచారణకు వస్తుందని సిన్హా విలేకరులకు వెల్లడించారు. గౌహతి హైకోర్టు తీర్పుపై ప్రశ్నించగా.. ‘‘మేం మా పనిని ఎప్పట్లాగే చేస్తున్నాం. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులపై ఆ తీర్పు ప్రభావం ఉండదు’’ అని ఆయన తెలిపారు.
 
 సీబీఐ కేసులు చెల్లవంటూ రాజా, సజ్జన్ కేసుల్లో  న్యాయవాదుల వాదనలు..
 
 గౌహతి హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం కోర్టుల్లో ఆసక్తికర వాదనలు జరిగాయి. సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమైనందున 2జీ కేసు విచారణపై స్టే విధించాలని కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాతోపాటు ఆ కేసులో పలువురు నిందితులు ఢిల్లీ కోర్టును కోరారు. కేసు విచారణను కొనసాగించినట్లయితే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వారి తరఫు న్యాయవాదులు జడ్జికి విన్నవించారు. అయితే వారి వాదనలను సీబీఐ ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ తోసిపుచ్చారు. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా నిర్ణయం తీసుకోలేనని చెప్పారు. దీంతో నిందితుల తరఫు న్యాయవాదులు అప్పటికప్పుడు కోర్టు తీర్పును జడ్జికి చూపించారు. ఈ కేసులో విచారణను నిలిపివేయాల్సిందిగా కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. 1984 నాటి సిక్కుల అల్లర్ల కేసులో నిందితుడు, కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కూడా ఇదే వాదనను వినిపించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చట్ట వ్యతిరేకమని ప్రకటించాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. తనపై దాఖలు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టివేయాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు