‘నాకు మెరుగైన భవిష్యత్తు కావాలి’

27 Sep, 2019 20:52 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘నాకు మెరుగైన భవిష్యత్తు కావాలి. నా భవిష్యత్తు, మనందరి భవిష్యత్తును కాపాడాలనుకుంటున్నాను. అంతేకాదు భవిష్యత్‌ తరాలతో పాటు ప్రస్తుతం నా సాటి పిల్లలందరి భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాను’ అంటూ రిధిమ పాండే నూయార్క్‌లో వాతావరణ మార్పులు, సంక్షోభం గురించి ఉద్వేగపూరిత ప్రసంగం చేసింది. ‘మన ప్రభుత్వం కాగితాల మీద మాత్రమే పనిచేస్తుంది. పర్యావరణ పరిరక్షణకై క్షేత్రస్థాయిలో అసలు ఏ చర్యలు తీసుకోవడం లేదు’ అని ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ప్రస్తుతం ప్రపంచమంతా పర్యావరణ కార్యకర్త గ్రెటా థంబర్గ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ.. హరిద్వార్‌కు చెందిన పదకొండేళ్ల రిధిమాను.. ‘భారత గ్రెటా థంబర్గ్‌’ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. గ్రెటా... ఫ్రైడే ఫర్‌ ఫ్యూచర్‌ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుంటే... రిధిమా సైతం పర్యావరణ పరిరక్షకు నడుం బిగించింది. వాతావరణ మార్పులపై 2017లో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్‌ను దాఖలు చేసి వార్తల్లో నిలిచింది.

ఇక సోమవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ ప్రణాళిక సదస్సుకు రిధిమ కూడా హాజరైంది. వాతావరణ మార్పులపై ఆయా దేశాల ప్రభుత్వాల వ్యవహారశైలికి వ్యతిరేకంగా థంబర్గ్‌తో పాటు నిరసన చేపట్టిన 16 మంది పిల్లల్లో రిథిమ కూడా ఒకరు. ఈ సందర్భంగా రిధిమ మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా ప్రక్షాళన కార్యక్రమంపై విమర్శలు గుప్పించింది. ‘ గంగను మనం అమ్మా అని పిలుస్తాం. అయితే ఆ నదిలోనే మురికి బట్టలు కూడా ఉతుకుతాం. చెత్త కూడా పారేస్తాం. ఇక ప్రభుత్వమేమో నదిని ప్రక్షాళన చేస్తామని చెబుతుంది. అయితే ఆ మాటలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. నేటికీ గంగ కాలుష్యానికి గురవుతోంది. ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడితేనే నదీ పరివాహక ప్రాంతంలో మానవాళి మనుగడ కొనసాగుతుంది అని పేర్కొంది. అదే విధంగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని పలు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ.. చిత్తశుద్ధి కనబరచడం లేదని విమర్శించింది. కాగా తన తండ్రితో కలిసి న్యూయార్క్‌ వెళ్లిన రిధిమ.. ఓ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్హత సాధించి గ్రెటా వంటి తోటి పర్యావరణ ప్రేమికులను కలుసుకునే అవకాశం కలిగిందని హర్షం వ్యక్తం చేసింది.

 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా