ఏబీ డివిలియర్స్ తప్పుకున్నాడు!

13 Dec, 2016 10:53 IST|Sakshi
ఏబీ డివిలియర్స్ తప్పుకున్నాడు!

కేప్టౌన్:దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక తాను దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించలేనంటూ తేల్చిచెప్పాడు. గత కొంతకాలంగా మోచేతి గాయంతో సతమవుతున్న ఏబీ.. టెస్టు కెప్టెన్సీకి తాజాగా గుడ్ బై చెప్పాడు. ఇది తక్షణమే అమల్లోకి రానుంది.  దాంతో త్వరలో శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా సారథ్య బాధ్యతలను డు ప్లెసిస్ నిర్వర్తించనున్నాడు. ఈ మేరకు డు ప్లెసిస్ను శాశ్వత కెప్టెన్గా చేయాలంటూ ఏబీ చేసిన సిఫారుసును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అంగీకరించింది.

 

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్ల నుంచి ఏబీ గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతో జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్.. దక్షిణాఫ్రికా ఘన విజయంలో పాలు పంచుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను డు ప్లెసిస్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా క్లీన్స్వీప్ చేయగా,  ఆ తరువాత ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను సఫారీలు 2-1 తేడాతో గెలుచుకున్నారు. అంతకుముందు న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ను కూడా డు ప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా 1-0 తో గెలుచుకుంది. దాంతో డు ప్లెసిస్ శాశ్వత పగ్గాలు చేపడితే బాగుంటుందనే వాదన వినిపించింది. ఈ తరుణంలో ఏబీ కూడా టెస్టు కెప్టెన్గా చేయడానికి విముఖత  చూపడంతో డు ప్లెసిస్ కు ఆ బాధ్యతలను అప్పజెప్పనున్నారు.


ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా టెస్టు సారథి బాధ్యతల నుంచి హషీమ్ ఆమ్లా తప్పుకోవడంతో డివిలియర్స్ కు పూర్తి స్థాయి పగ్గాలు అప్పజెప్పారు.  ఇంగ్లండ్ తో సిరీస్ జరుగుతున్న సమయంలో ఆమ్లా తన పదవికి వీడ్కోలు చెప్పాడు. దాంతో డివిలియర్స్ను శాశ్వత టెస్టు కెప్టెన్గా చేస్తూ  దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.  కాగా, కొంతకాలంగా డివిలియర్స్ను గాయాల బెడద వేధిస్తుండటంతో జట్టుకు దూరమవుతూ వచ్చాడు. ఇదే క్రమంలో తన టెస్టు కెప్టెన్సీ నుంచి వైదులుగుతున్నట్లు డివీ ప్రకటించాడు.  డివిలియర్స్ టెస్టు పగ్గాలు చేపట్టిన తరువాత దక్షిణాఫ్రికా ఒక టెస్టు మ్యాచ్ గెలవగా, ఒక మ్యాచ్లో ఓడింది.

మరిన్ని వార్తలు