ఆతిథ్య జట్టుదే సిరీస్‌: బ్రియన్‌ లారా

2 Aug, 2019 11:37 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ : ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో విజయం ఇంగ్లండ్‌దే అని వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియన్‌ లారా అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్‌ను సొంతం చేసుకుంటుందని పేర్కొన్నాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఈ మేరకు...‘ యాషెస్‌ 2019లో విజేత ఇంగ్లండ్‌. అత్యధిక పరుగులు చేసే బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌, అత్యధిక వికెట్లు తీసే ఆటగాడు క్రిస్‌ వోక్స్‌’ అని లారా ట్వీట్‌ చేశాడు.

కాగా ఇంగ్లండ్‌ బౌలర్ల జోరు... ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పోరాటం మధ్య చరిత్రాత్మక యాషెస్‌ సిరీస్‌ ఆసక్తిగా ప్రారంభమైంది. టాంపరింగ్‌ వివాదం, సస్పెన్షన్‌ అనంతరం తొలి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్మిత్‌ గురువారం నాటి మ్యాచ్‌లో శతకంతో పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. కెరీర్‌లో 24వ శతకం ((219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు)) సాధించాడు. ఇక ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో మొదలైన టెస్టులో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌కు  లోయర్‌ ర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పీటర్‌ సిడిల్‌ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు ఇంగ్లండ్‌ పేసర్లు స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/86), క్రిస్‌ వోక్స్‌ (3/58) ధాటికి 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌  తక్కువ స్కోరే చేసేలా కనిపించింది. అయితే, స్మిత్‌ సెంచరీతో ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ రెండు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 10 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు