22 ఫోర్లు, 6 సిక్సర్లతో విజృంభణ

29 Jun, 2017 19:51 IST|Sakshi
22 ఫోర్లు, 6 సిక్సర్లతో విజృంభణ

బ్రిస్టల్‌: జట్టు మొత్తం విఫలమైనా ఒక్క క్రీడాకారిణి మాత్రం ఎదురునిలిచారు. డిపెండింగ్‌ చాంపియన్‌ బౌలర్ల ధాటికి తోటి ప్లేయర్లు పెవిలియన్‌కు వరుస కట్టినా లెక్కచేయకుండా విజృభించారు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఆమె శ్రీలంక మహిళా క్రికెట్‌ ప్లేయర్‌ చామరి ఆటపట్టు. మహిళా వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయ సెంచరీతో ఆమె వీరవిహారం చేశారు. 143 బంతుల్లో 22 ఫోర్లు, 6 సిక్సర్లతో 178 పరుగులు సాధించారు.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. జట్టులోని మిగతా క్రీడాకారిణులు అంతా కలిసి 60 పరుగులు చేస్తే చామరి ఆటపట్టు ఒకరే 178 పరుగులు చేయడం విశేషం. ఆటపట్టు సాధించిన పరుగుల్లో 124 బౌండరీల ద్వారానే వచ్చాయంటే ఆమె విజృంభణ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్‌ బౌలర్లు 19 ఎక్స్‌ట్రాలు సమర్పించుకున్నారు. ఏడుగురు ఆస్ట్రేలియా బౌలర్లు బౌలింగ్‌ చేసినా ఆటపట్టును అవుట్‌ చేయలేకపోయారు.

వన్డేల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెట్‌ బ్యాట్స్‌వుమన్‌గా చామరి ఆటపట్టు నిలిచారు. వుమన్‌ వన్డే వరల్డ్‌కప్‌లో సెంచరీ చేసిన తొలి శ్రీలంక క్రీడాకారిణిగా ఘనత సాధించారు. వన్డేల్లో ఆమె మొత్తం మూడు సెంచరీలు బాదారు. చామరి ఆటపట్టు మినహా వన్డేల్లో ఇప్పటి వరకు శ్రీలంకకు చెందిన మరో క్రీడాకారిణి సెంచరీ సాధించలేదు.

మరిన్ని వార్తలు