క్లైవ్ రైస్ కన్నుమూత

29 Jul, 2015 01:00 IST|Sakshi
క్లైవ్ రైస్ కన్నుమూత

నిషేధం తొలగిన తర్వాత దక్షిణాఫ్రికాకు తొలి కెప్టెన్
కేప్‌టౌన్:
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లైవ్ రైస్ బ్రెయిన్ ట్యూమర్‌తో మంగళవారం మృతి చెందారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న రైస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు వచ్చి బెంగళూరులో రొబోటిక్ రేడియేషన్ చికిత్స కూడా చేయించుకున్నారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికా జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించడంతో దాదాపు 20 ఏళ్ల పాటు రైస్ కెరీర్ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైంది.

1991లో దక్షిణాఫ్రికాపై నిషేధం ఎత్తివేసిన తర్వాత భారత్‌తో జరిగిన తొలి వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా రైస్ ప్రపంచ క్రికెట్‌కు చిరపరిచితుడు. 42 ఏళ్ల వయసులో ఆ సిరీస్‌లో ఆడిన మూడు వన్డేల అనంతరం ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేకపోవడంతో రైస్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఠ 1971-1991 మధ్య ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రపంచంలోని మేటి ఆల్‌రౌండర్లతో సమానంగా రైస్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. వివాదాస్పద కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్‌లో కూడా ఆయన పాల్గొన్నారు. ఠ మొత్తం 482 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన క్లైవ్ రైస్ 40.95 సగటుతో 48 సెంచరీలు సహా 26,331 పరుగులు చేశారు. తన పేస్ బౌలింగ్‌తో 22.49 సగటుతో 930 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వార్తలు