మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ ఎంపికపై సమీక్ష

25 Jul, 2019 12:01 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ నియామకాన్ని సమీక్షించాలని క్రికెట్‌ పరిపాలక కమిటీ(సీఓఏ) ఎట్టకేలకు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ను కోరింది. నిజానికి ఏప్రిల్‌లోనే నియామకంపై సమీక్ష చేయాలని భావించినా ఇన్నాళ్లకు సీఓఏ ఈ నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పరిస్థితుల్లో కపిల్‌, అన్షుమన్‌, శాంతా రంగస్వామి నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ రామన్‌ను గతేడాది డిసెంబర్‌లో కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

అప్పట్లలోనే రామన్‌ ఎంపిక విషయంలో సీఓఏ సభ్యులు వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జీ మధ్య విభేదాలు తలెత్తాయి. కోచ్‌ను తాత్కాలిక కమిటీ ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధమని ఎడుల్జీ విమర్శించారు. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా సంఘానికే మాత్రమే ఆ అధికారం ఉందన్నారు. అప్పుడు ఆమెతో రాయ్‌ విభేదించారు. ఇప్పుడు మళ్లీ తాత్కాలిక కమిటీకే పురుషుల కోచ్‌ బాధ్యతను అప్పగించడం గమనార్హం.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల దృష్ట్యా గంగూలీ, లక్ష్మణ్ ఏదో ఒక పదవికే పరిమితం కావాలని జైన్‌ ఇంతకుముందే సూచించడంతో కపిల్‌ కమిటీకి బాధ్యత అప్పగించారు. కొత్తగా బీసీసీఐ ఆటగాళ్ల సంఘం ఏర్పాటులో కపిల్‌, శాంతా రంగస్వామి కీలకంగా పనిచేస్తుండటంతో వీరూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వచ్చారు. దాంతో మహిళ క్రికెట్‌ కోచ్‌గా డబ్యూవీ రామన్‌ నియామకం సరిగా జరిగిందా.. లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డీకే జైన్‌ను సీఓఏ విజ్ఞప్తి చేసింది. 

మరిన్ని వార్తలు