అతనుంటే కోహ్లికే లాభం

6 Jan, 2017 03:34 IST|Sakshi
అతనుంటే కోహ్లికే లాభం

మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌  

ముంబై: ఎంఎస్‌ ధోనిలాంటి అనుభవ కలిగిన ఆటగాడు ఉండడం ఏ జట్టుకైనా వరమే అని భారత జట్టు మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డారు. ఒక రకంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ విషయంలో అదృష్టవంతుడేనని అన్నారు. మ్యాచ్‌లో ధోని సలహాలతో పాటు ఆటపై అతడికున్న అపార పరిజ్ఞానం వెలకట్టలేని విధంగా కోహ్లికి ఉపయోగపడుతుందని చెప్పారు. ‘ధోని ఫామ్‌లో ఉండి జట్టులో చోటు దక్కించుకుంటే అతడి అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఒత్తిడిలో ఉన్న సమయంలో అతడి సామర్థ్యం భారత్‌కు మేలు చేకూర్చేదే. ఇలాంటి ఆటగాడు దొరకడం అంత సులువు కాదు. అయితే తను కూడా ఫామ్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే జట్టులో చోటు ఉంటుంది. ఇదే జరిగితే రానున్న భారీ టోర్నమెంట్లలో వన్డే జట్టుకు అత్యంత విలువైన ఆటగాడు ఉన్నట్టే. కోహ్లి కూడా ధోనిలాంటి ఆటగాడు ఫామ్‌లో ఉంటూ జట్టులో ఉండాలనే కోరుకుంటాడు’ అని ద్రవిడ్‌ అన్నారు.

2007లో ధోనికి పగ్గాలు అప్పగించేందుకు ద్రవిడ్‌ కెప్టెన్సీ తప్పుకున్నారు. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండడం అంటే మామూలు విషయం కాదని, ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయమని అన్నారు. తను ఈ విషయంలో సమర్థంగా పనిచేశాడని, ప్రశాంతచిత్తంతో ముందుకెళ్లాడని ప్రశంసించారు. నిజానికి తను సాధించాల్సింది కూడా ఏమీ లేదని, అన్నింటిని జట్టుకు అందించాడని గుర్తుచేశారు. భారత్‌ నుంచి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర అతడిని గుర్తుంచుకుంటుందని తేల్చారు.

సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం
భారత వన్డే జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి ఎంఎస్‌ ధోని సరైన సమయంలో తప్పుకున్నాడని ద్రవిడ్‌ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ నిర్ణయంతో 2019 ప్రపంచకప్‌ కోసం జట్టును పటిష్ట పరుచుకునేందుకు కోహ్లికి తగినంత సమయం దొరుకుతుందని చెప్పారు. ‘ధోని నిర్ణయంలో ఆశ్చర్యమేమీ లేదు. అతడికి తెలుసు వాస్తవ పరిస్థితేమిటో. చాంపియన్‌ ట్రోఫీ వరకు అతడి ముందుకు కేవలం ఒక వన్డే సిరీస్‌ మాత్రమే ఉంది. అయితే వచ్చే ప్రపంచకప్‌ వరకు కొనసాగలేకపోతే ముందుగానే కెప్టెన్సీ పగ్గాలను కోహ్లికి అప్పగించడం ఉత్తమం అని భావించినట్టు ఉన్నాడు. నిజానికి ఇది పెద్ద విషయం కాదు. కొన్నాళ్లు తను మరొకరి కింద ఆడాలని భావిస్తున్నాడు’ అని అండర్‌–19 కోచ్‌ కూడా అయిన ద్రవిడ్‌ వివరించారు.

 ధర్నాకు దిగేవాణ్ని!: గావస్కర్‌  
న్యూఢిల్లీ: ‘మిస్టర్‌ కూల్‌’ మహేంద్రసింగ్‌ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిదే కానీ... ఆటకే వీడ్కోలు పలికితే అతని ఇంటి ముందు తాను ధర్నాకు దిగేవాడినని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నారు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై ఆయన తనదైన శైలిలో  స్పందించారు. అతనిలో ఇంకా ఆట మిగిలుందని, నాలుగు లేదంటే ఐదో స్థానంలో అతను బరిలోకి దిగితే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడని సన్నీ కితాబిచ్చారు. ‘ధోని ఇప్పటికీ గొప్ప ఫినిషరే. కానీ నాలుగు లేదా ఐదు స్థానాల్లో అతను భారీ ఇన్నింగ్స్‌ ఆడగలడు. అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు పంపిస్తే అర్థం లేదు’ అని అన్నారు. వికెట్ల వెనుక కీపర్‌గా అతనెన్నో అద్భుతాలు చేశాడని చెప్పారు. భారత్‌కు అత్యుత్తమ సారథిగా చిరస్మరణీయ విజయాలందించిన ధోనిని కలర్‌దుస్తుల్లో (వన్డే, టి20ల్లో) చూడాలనుకుంటున్నట్లు లిటిల్‌ మాస్టర్‌ చెప్పారు. ‘ధోని సారథ్యం నుంచి తప్పుకోవడం నాకేమీ ఆశ్చర్యమనిపించలేదు. కానీ కాస్త ముందుగా దిగిపోయాడు. చాంపియన్స్‌ ట్రోఫీ ముగిసేదాకా సారథిగా కొనసాగుతాడని భావించా. అయితే ధోని మాత్రం తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని భావించివుంటాడు’ అని సన్నీ అన్నారు. విజయవంతమైన కెప్టెన్‌గా విశేష అనుభవమున్న ధోని సహకారాన్ని కోహ్లి పొందితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ఫార్మాట్లలోనూ సారథ్యం వహించే సత్తా ఇప్పుడు కోహ్లికుందని గావస్కర్‌ అన్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌కు అతను అందుబాటులో ఉంటాడా అన్న ప్రశ్నకు బదులిస్తూ అది అతని ఫామ్, సామర్థ్యంపై ఆధారపడి వుంటుందని బదులిచ్చారు.

మరిన్ని వార్తలు