కుంబ్లేకు సారీ చెబుతున్నా..

30 Jun, 2017 14:02 IST|Sakshi
కుంబ్లేకు సారీ చెబుతున్నా..

న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లిల మధ్య వివాదం తారాస్థాయికి చేరడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే(బీసీసీఐ) కారణమని దిగ్గజ ఆటగాడు బిషన్ సింగ్ బేడీ ధ్వజమెత్తారు. ఈ వివాదంలో కుంబ్లేను బలిపశువును చేశారంటూ బీసీసీఐ తీరును బేడీ తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదన్న బేడీ.. ఇక్కడ కచ్చితంగా కుంబ్లేకు సారీ చెప్పాల్సి ఉందన్నారు.

'ఇది క్రికెట్ లో ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఆన్ ఫీల్డ్ లో బాస్ ఎవరు.. ఆఫ్ ఫీల్డ్ లో బాస్ ఎవరు అనేది ఇక్కడ అనవసరం. మనం చిన్న పిల్లలం కాదు. విచక్షణ తెలిసిన పెద్దలం. మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ లక్ష్యం ఒక్కటే ఉంటుంది. మరి అటువంటప్పుడు నేను గొప్ప అనే భావన ఎందుకు. విరాట్-కుంబ్లేల వివాదం పెద్దది కావడానికి ఆజ్యం పోసింది బీసీసీఐ. బీసీసీఐలో ఎటువంటి అర్హత లేనివారు ఉండటమే సరిగా హ్యాండిల్ చేయలేకపోవడానికి కారణమైంది. 

ఇక్కడ కుంబ్లేకు నేను సారీ చెప్పాలనుకుంటున్నా. అతను వైదొలిగిన తీరు చాలా బాధాకరం. ఒక ప్రధాన కోచ్ చేత బలవంతంగా షూస్ తీయించింది ఎవరు. బీసీసీఐలోని పెద్దలే కదా. దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు సౌరవ్ గంగూలీకి కూడా వివాదాన్ని పరిష్కరించలేకపోయాడు. ఈ తరహా రోత పుట్టించే వివాదంలో మీరు చేతులు కడుక్కోలేరు. ఏ సందేశాన్ని ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు. ఇద్దరు మధ్య చోటు చేసుకున్న విభేదాన్ని పరిష్కరించే తీరు ఇదేనా' అని బేడీ విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు