గెలిచినా మార్పులు తప్పేలా లేవు!

25 Jan, 2020 13:41 IST|Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టీ20కి  కూడా అదే ఊపుతో సన్నద్ధమవుతోంది. మొదటి టీ20 జరిగిన ఆక్లాండ్‌ వేదికగానే రెండో టీ20 కూడా జరుగుతుండటంతో కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ మరో గెలుపుపై కన్నేసింది. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌లో మరింత ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఇప్పటికే తుది జట్టు ఎలా ఉండాలనే దానిపై స్పష్టతకు వచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్‌.. మార్పులు చేసేందుకు సై అంటోంది. తొలి టీ20లో ఆటను పరిగణలోకి తీసుకుని మార్పులు చేయాలని చూస్తోంది. 

అయితే ఇక్కడ ఒక్క మార్పు మాత్రమే చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సిరీస్‌ ఆరంభపు మ్యాచ్‌ను ఓవరాల్‌గా చూస్తే రోహిత్ శర్మ, శివం దూబేలతో పాటు శార్దూల్ ఠాకూర్‌ కూడా ఆకట్టుకోలేదు. అయితే హార్డ్‌ హిట్టర్‌ అయిన శివం దూబేను రేపటి మ్యాచ్‌ నుంచి తొలగించకపోవచ్చు. బ్యాటింగ్‌లో సత్తాచాటకపోయినా, పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా వికెట్‌ తీసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. టీ20 వరల్డ్‌కప్‌ సన్నాహకంలో భాగంగా హార్డ్‌ హిట్టర్‌ అయిన దూబేకు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో రెండో టీ20లో ఆడే చాన్స్‌ ఎక్కువగా ఉంది. ఇక రోహిత్ శర్మ రెండో టీ20లో రాణించి గాడిలో పడాలని చూస్తున్నాడు. తొలి టీ20లో రాహుల్‌, కోహ్లిలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దితే, అయ్యర్‌ సమయోచితంగా ఆడాడు. అయ్యర్‌కు మనీష్‌ పాండే నుంచి చక్కటి సహకారం లభించింది.(ఇక్కడ చదవండిఅది కొత్త అనుభూతిని కలిగిస్తోంది: అయ్యర్‌)

బౌలింగ్‌ విభాగంలో షమీతో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ అంచనాలను అందుకోలేదు. కాగా, షమీ ప్రధాన బౌలర్‌ కావడంతో అతన్ని తప్పించే సాహసం చేయరు. ఇక శార్దూల్‌ వికెట్‌ సాధించినా మూడు ఓవర్లు వేసి 44 పరుగులిచ్చాడు. ఆల్‌ రౌండర్‌ కోటాలో రవీంద్ర జడేజా స్థానం పదిలమనే చెప్పొచ్చు. దాంతో శార్దూల్‌కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న నవదీప్‌ సైనీని తుది జట్టులోకి తీసుకోవడంపై కసరత్తు చేస్తున్నారు. భారత బ్యాటింగ్‌ పటిష్టంగా ఉన్న తరుణంలో బౌలింగ్‌ను పటిష్టం చేసే పనిలో పడింది. దాంతో సైనీ ఎంపిక దాదాపు ఖాయంగా కనబడుతోంది. మరొకసారి యువ స్పెషలిస్టు కీపర్లు రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌లు రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలే ఎక్కువ. కేఎల్‌ రాహుల్‌ అటు కీపర్‌గా బ్యాట్స్‌మన్‌గా సత్తాచాటడంతో పంత్‌, శాంసన్‌లకు నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు. 

భారత తుది జట్టు(అంచనా)
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, శివం దూబే, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ, సైనీ, చహల్‌

మరిన్ని వార్తలు