దక్షిణాసియా టీటీ టీమ్ విభాగంలో పసిడి పతకం

22 Jul, 2013 06:12 IST|Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన ఆకుల శ్రీజ సత్తా చాటింది. అద్భుత ప్రదర్శనతో ఆమె కెరీర్‌లో తొలి అంతర్జాతీయ పతకాన్ని సాధించింది. శ్రీజ ప్రాతినిధ్యం వహించిన భారత క్యాడెట్ బాలికల జట్టు టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది.
 
 దీంతో పాటు భారత బాల, బాలికల జట్లు నాలుగు బంగారు పతకాలను సాధించాయి. ఈ నాలుగు ఫైనల్ ఈవెంట్లలోనూ శ్రీలంకే పరాజిత కావడం గమనార్హం. క్యాడెట్ బాలికల ఫైనల్లో భారత జట్టు 3-0తో శ్రీలంకపై గెలుపొందింది. మొదట ఏపీ క్రీడాకారిణి శ్రీజ 11-1, 12-10, 11-5తో పావని సిరిసేనపై అలవోక విజయం సాధించి జట్టుకు శుభారంభాన్నిచ్చింది.
 
  తర్వాత సాగరిక 11-3, 11-5, 11-4తో రిద్మి కరదన్నరచ్చిపై గెలిచింది. డబుల్స్‌లో సాగరిక ముఖర్జీ-హర్షవర్ధని జోడి 11-2, 11-3, 11-0తో పావని-రిద్మి ద్వయంపై గెలుపొందింది. తాజా టైటిల్ విజయంతో భారత బృందం దోహాలో జరగనున్న ఆసియా జూనియర్ టోర్నీకి అర్హత సంపాదించింది. జూనియర్ బాలికల ఫైనల్లోనూ భారత జట్టు 3-0తో లంకను మట్టికరిపించింది. జూనియర్ బాలుర ఫైనల్లో భారత జట్టు 3-0తో శ్రీలంకపై నెగ్గింది. క్యాడెట్ బాలుర ఫైనల్లోనూ భారత జట్టు 3-0తో శ్రీలంకపైనే గెలుపొందింది.
 

మరిన్ని వార్తలు