బుమ్రా వచ్చేశాడు

18 Dec, 2019 01:36 IST|Sakshi

భారత జట్టుతో కలిసి సాధన

సాక్షి, విశాఖపట్నం: వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లో ఒకే ఒక ఆటగాడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అయితే అతను జట్టు సభ్యుడు కాదు, ఈ మ్యాచ్‌కు బరిలోకి దిగడం లేదు! ఆ వ్యక్తి స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. వెన్ను గాయంతో కొంత కాలంగా జట్టుకు దూరమైన అతను తొలిసారి టీమిండియా సాధనలో భాగమయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో గత కొంత కాలంగా బుమ్రా సొంతంగా నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తూ వచ్చాడు. కానీ మొదటిసారి అతను ఒక సిరీస్‌ సందర్భంగా జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. మంగళవారం బుమ్రా బౌలింగ్‌ను కోచ్‌ రవిశాస్త్రి, సెలక్టర్‌ దేవాంగ్‌ గాంధీ పర్యవేక్షించారు. రిషభ్‌ పంత్, పాండే, మయాంక్‌లకు బుమ్రా పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేశాడు.

బంతులు విసిరే సమయంలో ఏ రకంగానూ అతను ఇబ్బంది పడినట్లు కనిపించలేదు. బుమ్రా ఫిట్‌నెస్‌ స్థాయిని బట్టి చూస్తే త్వరలోనే అతను జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాడు పృథ్వీ షా కూడా ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరయ్యాడు. డోపింగ్‌ నిషేధం ముగిసిన తర్వాత దేశవాళీ క్రికెట్‌ బరిలో దిగిన షా త్వరలోనే పునరాగమానాన్ని ఆశిస్తున్నాడు. తన ఫిట్‌నెస్‌కు సంబంధించి ట్రైనర్‌ నిక్‌ వెబ్‌తో ఎక్కువ సేపు అతను సంభా షించాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌తో కలిసి అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. మరోవైపు మంగళవారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ కావడంతో భారత కెపె్టన్‌ కోహ్లి, వైస్‌ కెపె్టన్‌ రోహిత్, ఓపెనర్‌ రాహుల్‌ మాత్రం సాధనలో పాల్గొనలేదు.

>
మరిన్ని వార్తలు