మూడో వన్డేకు రిచర్డ్సన్ దూరం

7 Feb, 2016 16:59 IST|Sakshi

సిడ్నీ:ఆస్ట్రేలియా పేస్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ గాయం కారణంగా న్యూజిలాండ్తో జరుగనున్న మూడో వన్డేకు  దూరం కానున్నాడు. శనివారం జరిగిన రెండో వన్డే అనంతరం రిచర్డ్సన్ కు వెన్నునొప్పి తీవ్రం కావటంతో అతని మూడో వన్డేకు విశ్రాంతినిచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)పేర్కొంది. దీనిలో భాగంగానే అతన్ని స్వదేశానికి పంపుతున్నట్లు స్పష్టం చేసింది. రిచర్డ్సన్ స్థానంలో జోల్ పారిస్ ను జట్టులో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇటీవల భారత్ తో జరిగిన సిరీస్ ద్వారా పారిస్ వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు.

 

అంతకుముందు న్యూజిలాండ్ లో జరిగిన షెఫెల్డ్ షీల్డ్ కు ఆడిన పారిస్ 37 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో రాణించాడు.ఇప్పటికే గాయాలు బారిన పడి ఆరోన్ ఫించ్, జేమ్స్ ఫాల్కనర్ లు జట్టుకు దూరం కావడంతో సతమవుతున్న ఆస్ట్రేలియాకు రిచర్డ్సన్ కూడా వైదొలగడం మరో ఎదురుదెబ్బ తగిలింది.  కీలకమైన మూడో వన్డేలో విజయం సాధించి సిరీస్ ను సాధించాలనుకుంటున్న ఆస్ట్రేలియా జట్టు తుది కూర్పుపై మల్లగుల్లాలు పడుతోంది. మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్  గెలిచి 1-1 సమంగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు