వారిపై నిషేధం విధించండి:ఫెల్ప్స్

9 Aug, 2016 14:51 IST|Sakshi
వారిపై నిషేధం విధించండి:ఫెల్ప్స్

రియో డీ జనీరో; క్రీడల్లో డ్రగ్ చీటింగ్కు పాల్పడే వారిపై జీవిత కాల నిషేధం విధించాలంటూ అమెరికా మేటి స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ ధ్వజమెత్తాడు. అసలు ఒకసారి డోపింగ్ పాల్పడిన వారిలో తిరిగి అనుమతించడం అంటూ ఉండకూడదన్నాడు. ఇలా తరచు కొంతమంది అథ్లెట్లు డ్రగ్స్  తీసుకోవడం తన హృదయాన్ని తీవ్రంగా కలిచి వేస్తుందన్నాడు.


'ఇటీవల కాలంలో అథ్లెట్లు డ్రగ్స్ తీసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. అది ఒక స్విమ్మింగ్ కే మాత్రమే పరిమితం కాదు.. ప్రతీ క్రీడలోనూ డ్రగ్స్ చీటింగ్ కొనసాగుతోంది. అలా ఒకసారి డోపింగ్ చేసిన వారికి కొంతకాలం వరకే నిషేధం విధిస్తున్నారు. డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినా వారిని గేమ్స్ కు అనుమతించడం చాలాసార్లు జరిగింది.  అలా చేయకుండా మొత్తం జీవితకాల నిషేధమే సరైనది' అని ఫెల్ప్స్ విమర్శించాడు.  రియో ఒలింపిక్స్ లో చైనా స్విమ్మర్ సున్ యాంగ్ గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం ఆస్ట్రేలియా స్విమ్మర్ మాక్ హార్టన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. డోపింగ్ దొంగలు వచ్చారంటూ సున్ యాంగ్ పై మాక్ విమర్శలు సంధించాడు. ఈ నేపథ్యంలో ఫెల్ప్స్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి.

మరిన్ని వార్తలు