37 పరుగులకే మూట సర్దేశారు!

24 Nov, 2015 19:28 IST|Sakshi
37 పరుగులకే మూట సర్దేశారు!

నదియా:1,5,7,2,4,0,1,1,7,0,5.. ఇదేదో మీ మేధా శక్తిని పెంచే పజిల్ కాదు. ఒక ఇన్నింగ్స్ లో రంజీ క్రికెటర్లు వరుసగా నమోదు చేసిన వ్యక్తిగత పరుగులు. గ్రూప్ -ఏలో భాగంగా మంగళవారం బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో ఒడిశా తన రెండో ఇన్నింగ్స్ ను ఆడుతూ అతి 'చెత్త' గణాంకాలను నమోదు చేసి 37 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ మ్యాచ్ లో ఓటమి తప్పదనుకున్న బెంగాల్ అనూహ్యంగా పుంజుకుని 133 పరుగుల తేడాతో విజయం సాధించింది.


ఈ రోజు 23/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన బెంగాల్ 55.2 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఒడిశా19.2 ఓవర్లలో 37 పరుగులకే చాపచుట్టేసింది. ఏ ఒక్క ఆటగాడు క్రీజ్ లో నిలదొక్కుకోకుండానే క్యూకట్టారు.  బెంగాల్ బౌలర్ అశోక్ దిండా సంచలన బౌలింగ్ తో ఒడిశా వెన్నువిరిచాడు. దిండా 10 ఓవర్లలో 19 పరుగులిచ్చి ఏడు వికెట్లు నేలకూల్చాడు. అతని జతగా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మూడు వికెట్లు తీయడంతో ఒడిశాకు ఓటమి తప్పలేదు. దీంతో నాలుగు రోజులు జరగాల్సిన మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది.

బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 142 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 135 ఆలౌట్

ఒడిశా తొలి ఇన్నింగ్స్ 107 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 37 ఆలౌట్

మరిన్ని వార్తలు