చరిత్ర సృష్టించిన దేవేంద్ర జజారియా

23 Jul, 2013 05:04 IST|Sakshi
చరిత్ర సృష్టించిన దేవేంద్ర జజారియా

- పారా అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

భారత్‌కు చెందిన పారా అథ్లెట్ దేవేంద్ర జజారియా చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్‌లోని లియోన్‌లో జరుగుతున్న ఐపీసీ అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో దేవేంద్ర జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించాడు. తద్వారా ఈ మెగా టోర్నీలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఆదివారం రోన్ స్టేడియంలో జరిగిన ఎఫ్-46 విభాగంలో 57.04మీ. దూరం జావెలిన్‌ను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. ఈనెల 19 నుంచి జరుగుతున్న ఈ పోటీలు 28న ముగుస్తాయి. దేవేంద్ర రికార్డుపై భారత పారాలింపిక్స్ కమిటీ హర్షం వ్యక్తం చేస్తూ రూ.5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. మరోవైపు 2012 లండన్ పారాలింపిక్స్‌లో రజతం సాధించి అందరి దృష్టినీ ఆకర్శించిన ఎన్.గిరీష పురుషుల హైజంప్‌లో (1.65మీ.) నిరాశ పరిచి ఆరో స్థానంలో నిలిచాడు.

ఎవరీ దేవేంద్ర
32 ఏళ్ల దేవేంద్ర జజారియా రాజస్థాన్‌కు చెందిన క్రీడాకారుడు. 2004లో ఏథెన్స్‌లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్ సందర్భంగా ఇతడు అందరి దృష్టినీ ఆకర్శించాడు. ఆ పోటీల్లో 62.15మీ. దూరం జావెలిన్ విసిరి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాగే భారత్ తరఫున పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్‌గా నిలిచాడు. 2012లో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. దేవంద్రకు ఎడమచెయ్యి లేదు.

మరిన్ని వార్తలు