పతకాలే కాదు... హృదయాలూ గెలవండి!

1 Aug, 2016 02:10 IST|Sakshi
పతకాలే కాదు... హృదయాలూ గెలవండి!

ప్రధాని మోదీ ఆకాంక్ష  రియో అథ్లెట్లకు పీఎం ‘బెస్టాఫ్ లక్’


న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో పతకాలు సాధించడంతో పాటు ఇతర దేశాల అథ్లెట్ల మనసులు కూడా గెలుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కేవలం మైదానంలోనే కాకుండా ప్రతీ చోటా భారత ఆటగాళ్లను ప్రపంచం చూస్తుందని, తమ ప్రవర్తనతో వారు ఆకట్టుకోవాలని ఆయన అన్నారు. ‘భారత అథ్లెట్లు ఎక్కడికి వెళ్లినా వారిపై అందరి దృష్టి ఉంటుంది. పతకాలతో పాటు పక్కవారి మనసులు కూడా మనవాళ్లు గెలుస్తారని, భారత జాతి వారసత్వ సంపద గురించి ప్రపంచానికి చాటుతారని నాకు నమ్మకముంది. మీ వెంట 125 కోట్ల మంది ఉన్నారు. దేశం 70వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయంలో రియోలో కూడా మన జెండా గర్వంగా ఎగరాలి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చేందుకు ‘రన్ ఫర్ రియో’ పేరుతో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ రియోలో భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారని... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఈ సంఖ్య కనీసం 200కు చేరేలా ప్రభుత్వం అన్ని విధాలా మద్దతిస్తుందని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం రూ. 125 కోట్ల భారీ మొత్తం కేటాయించిందని, క్రీడల్లో పాల్గొనే సమయంలో తొలిసారి ఆటగాళ్లకు కూడా అధికారులతో సమానంగా రోజూవారీ అలవెన్స్‌లు అందిస్తున్నట్లు మోదీ గుర్తు చేశారు. గత ఒలింపిక్స్‌లలో భారత ప్రదర్శన, ఈసారి పాల్గొంటున్న ఆటగాళ్ల వివరాలతో కూడిన ప్రత్యేక బ్రోచర్‌ను ఈ సందర్భంగా విడుదల చేసిన చేసిన ప్రధాని... ఆటగాళ్లకు దేశం తరఫున అభినందనలు పంపడంలో ‘పోస్ట్‌మాన్’ తరహా బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

మరిన్ని వార్తలు