సూపర్ టై... రాయల్స్ జై!]

30 Apr, 2014 01:09 IST|Sakshi
సూపర్ టై... రాయల్స్ జై!]

బౌండరీల లెక్కలో నెగ్గిన రాజస్థాన్
 కోల్‌కతాకు నిరాశ    తొలుత మ్యాచ్ టై
 తర్వాత సూపర్ ఓవర్ కూడా టై
 నాటకీయంగా గట్టెక్కిన రాయల్స్
 
 స్కోర్లు సమమైతే టై.... ఫలితానికి సూపర్ ఓవర్ ఉంటుంది... ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై అయితే..?ఇన్నాళ్లూ అనేకసార్లు టి20 మ్యాచ్‌లు చూసినా... సూపర్ ఓవర్ టై కావడాన్ని మాత్రం చూడలేదు. ఐపీఎల్‌లో తొలిసారి ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాజస్థాన్, కోల్‌కతాల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే రెండు జట్లలో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టుది విజయం. మ్యాచ్‌లో రాజస్థాన్ 18 బౌండరీలు సాధించగా... కోల్‌కతా కేవలం 14 బౌండరీలు కొట్టింది. దీంతో రాజస్థాన్ ఖాతాలో విజయం చేరింది.
 
 అబుదాబి: నరాలు తెగే ఉత్కంఠ... ఆఖరి బంతి వరకూ ఇరు జట్లతో విజయం దోబూచులాట... అనూహ్య మలుపులు... క్షణక్షణానికీ మారిన సమీకరణాలు... అటు స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకులు, ఇటు టీవీసెట్ల ముందు కోట్లాది అభిమానులు అందరినీ మునికాళ్లమీద నిలబెట్టిన మ్యాచ్... తొలుత టై... ఆ తర్వాత సూపర్ ఓవర్ టై... కానీ బౌండరీలు ఎక్కువగా సాధించడం ద్వారా రాజస్థాన్ ఖాతాలో విజయం. షేక్ జయేద్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌండరీల లెక్కలో కోల్‌కతాపై గెలిచింది. తొలుత రెండు జట్లు 20 ఓవర్లలో 152 పరుగులు చేశాయి.
 
  దీంతో మ్యాచ్ టై అయింది. ఫలితం కోసం సూపర్ ఓవర్‌ను ఆశ్రయించగా... అక్కడ కూడా రెండు జట్లు 11 పరుగులు చేయడంతో మళ్లీ టై అయింది. ఇలాంటి సందర్భంలో నిబంధనల ప్రకారం... ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుదే విజయం. రాజస్థాన్ తమ ఇన్నింగ్స్‌లో 18 బౌండరీలు (ఫోర్లు, సిక్స్‌లు కలిపి) కొట్టగా.... కోల్‌కతా 14 మాత్రమే బాదింది. దీంతో రాయల్స్ గెలిచింది.
 
 అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఓపెనర్ రహానే (59 బంతుల్లో 72; 6 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచి నాణ్యమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. సంజు శామ్సన్ (19 బంతుల్లో 20; 4 ఫోర్లు), వాట్సన్ (24 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించారు. రహానే, వాట్సన్ మూడో వికెట్‌కు 45 బంతుల్లో 64 పరుగులు జోడించారు. ఆఖర్లో స్టీవ్ స్మిత్ (11 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) వేగంగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో వినయ్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా... షకీబ్, మోర్కెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
 
 కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన కెప్టెన్ గంభీర్ (44 బంతుల్లో 45; 4 ఫోర్లు) ఈసారి మాత్రం బాధ్యతగా ఆడి రాణించాడు. అయితే రాజస్థాన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో ఒత్తిడి పెంచారు. సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్సర్), షకీబ్ అల్ హసన్ (18 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో మ్యాచ్ కోల్‌కతా వైపు మొగ్గింది. అయితే ఫాల్క్‌నర్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో రకరకాలుగా మలుపులు తిరిగి మ్యాచ్ టై అయింది. రాజస్థాన్ బౌలర్లలో ఫాల్క్‌నర్ మూడు, తాంబే రెండు వికెట్లు తీశారు.
 
 స్కోరు వివరాలు
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) సూర్యకుమార్ (బి) వినయ్ 72; కరుణ్ నాయర్ (బి) వినయ్ 1; శామ్సన్ (బి) షకీబ్ 20; వాట్సన్ రనౌట్ 33; స్టువర్ట్ బిన్నీ (సి) బిస్లా (బి) మోర్కెల్ 0; స్టీవ్ స్మిత్ నాటౌట్ 19; ఫాల్క్‌నర్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు (వైడ్లు 5) 5; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 152.
 
 వికెట్ల పతనం: 1-13; 2-54; 3-118; 4-128; 5-145.
 బౌలింగ్: వినయ్ కుమార్ 4-0-30-2; మోర్నీ మోర్కెల్ 4-0-40-1; నరైన్ 4-0-28-0; షకీబ్ అల్ హసన్ 4-0-23-1; కలిస్ 1-0-4-0; పీయూష్ చావ్లా 3-0-27-0.
 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గంభీర్ (సి) అబ్దుల్లా (బి) భాటియా 45; బిస్లా (సి) నాయర్ (బి) రిచర్డ్‌సన్ 3; కలిస్ (సి) స్మిత్ (బి) తాంబే 13; మనీష్ పాండే ఎల్బీడబ్ల్యు (బి) తాంబే 19; సూర్యకుమార్ (సి) స్మిత్ (బి) ఫాల్క్‌నర్ 31; షకీబ్ అల్ హసన్ నాటౌట్ 29; ఉతప్ప (బి) ఫాల్క్‌నర్ 0; వినయ్ కుమార్ (బి) ఫాల్క్‌నర్ 0; పీయూష్ చావ్లా రనౌట్ 0; నరైన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బైస్ 2, వైడ్లు 6, నోబాల్స్ 2) 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 152.
 
 వికెట్ల పతనం: 1-21; 2-49; 3-85; 4-88; 5-137; 6-141; 7-141; 8-146.
 బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 1-0-7-0; రిచ ర్డ్‌సన్ 4-0-28-1; ఫాల్క్‌నర్ 2-0-11-3; ఇక్బాల్ అబ్దుల్లా 2-0-17-0; వాట్సన్ 3-0-26-0; భాటియా 4-0-29-1; ప్రవీణ్ తాంబే 4-0-31-2.
 
 ఫాల్క్‌నర్ బర్త్‌డే గిఫ్ట్
 ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయానికి కారణం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫాల్క్‌నర్. కోల్‌కతా విజయానికి రెండు ఓవర్లలో 16 పరుగులు అవసరం కాగా... ఫాల్క్‌నర్ 19వ ఓవర్లో కేవలం 4 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌లో మళ్లీ జీవం వచ్చింది. చివరి ఓవర్లో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో షకీబ్ పోరాడటంతో 11 పరుగులు వచ్చి మ్యాచ్ టై అయింది. అటు సూపర్ ఓవర్‌లోనూ ఫాల్క్‌నర్ చక్కగా బౌలింగ్ చేశాడు. ఈ విజయం తనకు చిరస్మరణీయం. ఎందుకంటే... మంగళవారం ఫాల్క్‌నర్ పుట్టినరోజు. ఈ విజయం ద్వారా తనకు తానే పుట్టిన రోజు గిఫ్ట్ ఇచ్చుకున్నాడు.
 
 2009 ఐపీఎల్‌లోనూ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ టై కాగా...సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ గెలిచింది. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇది ఐదో టై.
 
 సూపర్ ఓవర్ సాగిందిలా...
 కోల్‌కతా బ్యాటింగ్: బౌలర్: ఫాల్క్‌నర్
 తొలి బంతి - ఒక పరుగు. రెండో పరుగుకు వెళ్లి సూర్య రనౌట్.
 రెండో బంతి - పాండే సింగిల్
 మూడో బంతి - షకీబ్ సింగిల్
 నాలుగో బంతి - లాంగాన్ మీదుగా పాండే సిక్సర్
 ఐదో బంతి - పాండే సింగిల్
 ఆరో బంతి - ఒక పరుగు వచ్చింది. రెండో పరుగుకు వెళ్లి షకీబ్ రనౌట్
 మొత్తం: 11 పరుగులు
 
 రాజస్థాన్ బ్యాటింగ్: బౌలర్: నరైన్
 తొలి బంతి: వాట్సన్ సింగిల్
 రెండో బంతి: స్మిత్ రెండు పరుగులు
 మూడో బంతి: స్మిత్ సింగిల్
 నాలుగో బంతి: మిడ్ వికెట్ మీదుగా వాట్సన్ ఫోర్
 ఐదో బంతి: వాట్సన్ సింగిల్
 ఆరో బంతి: స్మిత్ రెండు పరుగులు
 మొత్తం: 11 పరుగులు
 
 ప్రధాన ఇన్నింగ్స్ 20 ఓవర్లలో కోల్‌కతా (14) కంటే ఎక్కువ బౌండరీలు కొట్టిన రాజస్థాన్ (18) విజేతగా నిలిచింది


 

>
మరిన్ని వార్తలు