సచిన్.. నీకిది తగునా?

8 Aug, 2014 22:26 IST|Sakshi
విజయవాడలో ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సచిన్

ఆటతోనే కాదు వినయ సంపనున్నుడిగా కూడా క్రికెటర్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అందరి మన్ననలు పొందాడు. అతడిని పెద్దల సభకు పంపినప్పుడు అందరూ హర్షించారు. సమకాలిన క్రికెట్ లో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న లిటిల్ మాస్టర్ విధాన నిర్ణేతగా తనదైన ముద్ర వేస్తాడని ఆశించారు. అయితే అందరి అంచనాలను క్రికెట్ దేవుడు తల్లకిందులు చేశాడు. రాజ్యసభకు రావడమే మానుకున్నాడు.

క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాతైనా ఈ క్రికెట్ స్టార్- పార్లమెంటేరియన్ గా ప్రతిభ చూపుతాడని ఎదురుచూసిన అభిమానులు ఆశలు కూడా ఫలించలేదు. క్రికెటర్ గా ఉన్నప్పుడే మూడుసార్లు పార్లమెంట్ లో దర్శనభాగ్యం కల్పించిన మాస్టర్... రిటైర్ తర్వాత సభ ముఖమే చూడలేదు. దీంతో ఒకప్పుడు తన విజయాలను ప్రస్తుతించిన పార్లమెంట్ లోనే ఇప్పడు విమర్శల పాలవుతున్నాడు. 'సెలబ్రిటీ ఎంపీలు పార్లమెంట్ కు అతిథులు' అన్న విమర్శను సచిన్ కూ అన్వయిస్తున్నారు.

అయితే తన అన్న అజిత్ టెండూల్కర్‌కు బైపాస్ సర్జరీ జరిగడం, ఇతర వ్యక్తిగత కారణాలవల్లే రాజ్యసభకు హాజరుకాలేదని సచిన్ వివరణయిచ్చాడు. అయితే సచిన్ వివరణ సహేతుకంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీరిక ఉంటుంది కాని, పార్లమెంట్ కు రావడానికి టైమ్ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల విజయవాడకు సచిన్ వచ్చి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. క్రికెట్  లో శిఖరసమానుడిగా ఎదిగిన సచిన్ ఇలా చేయడం తగదని అంటున్నారు. ఆటలో విఫలమైనప్పుడు బ్యాట్ తో సమాధానంతో చెప్పే సచిన్.. ఇప్పుడు 'అటెండెన్స్' తో విమర్శలకు అడ్డుకట్టవేస్తారా?

మరిన్ని వార్తలు