చందర్‌పాల్ ‘రికార్డు’ శతకం

21 Dec, 2013 01:34 IST|Sakshi
శివ్‌నారాయణ్ చందర్‌పాల్

హామిల్టన్: వెస్టిండీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (229 బంతుల్లో 122 నాటౌట్; 11 ఫోర్లు) తానెంత కీలక ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. నలభై ఏళ్లకు చేరువవుతున్నా జట్టు కష్టకాలంలో అండగా ఉంటూ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అజేయ సెంచరీ చేశాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ సాధించిన 16 అజేయ శతకాల రికార్డును చందర్‌పాల్ (17) అధిగమించాడు. ఓవరాల్‌గా తనకిది 29వ సెంచరీ కాగా... మ్యాచ్ రెండో రోజు తన జోరుతో విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 116.2 ఓవర్లలో 367 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. స్యామీ (3) నిరాశపరచగా చివర్లో పెరుమాల్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు; 1 సిక్స్), బెస్ట్ (44 బంతుల్లో 25; 3 ఫోర్లు) చందర్‌పాల్‌కు సహకరించారు.
 
 సౌతీకి నాలుగు, అండర్సన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ి  విలియమ్సన్ (148 బంతుల్లో 58; 5 ఫోర్లు), రాస్ టేలర్ (133 బంతుల్లో 56 బ్యాటింగ్; 8 ఫోర్లు) రాణించారు. ఈ జోడి మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించింది. ప్రస్తుతం క్రీజులో టేలర్‌తో పాటు మెకల్లమ్ (23 బంతుల్లో 11 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నాడు.
 
 ‘బోర్డర్’ను దాటిన చందర్‌పాల్
 86 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన చందర్‌పాల్ అద్భుత ఆటతీరుతో శతకం సాధించడమే కాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆరో ఆటగాడిగానూ నిలిచాడు.
 
 ఈక్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ సాధించిన పరుగులను అధిగమించాడు. 156 టెస్టుల్లో బోర్డర్ 11,174 పరుగులు చేయగా... ప్రస్తుతం చందర్‌పాల్ 153 టెస్టుల్లో 11,199 పరుగులతో ఉన్నాడు. విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా 11,953 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. జట్టులో లారా ఉన్నప్పుడు చందర్‌పాల్ సగటు (101 టెస్టుల్లో) 44.60 ఉండగా తన చివరి 52 టెస్టుల్లో ఇది దాదాపు 70గా ఉండడం ఈ సీనియర్ ఆటగాడి జోరును చూపుతోంది.  

మరిన్ని వార్తలు