ఫైనల్లో శ్రీలంక

4 Mar, 2014 00:49 IST|Sakshi
ఫైనల్లో శ్రీలంక


మిర్పూర్: అజేయ ఆటతీరుతో దూసుకెళుతున్న శ్రీలంక జట్టు ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. సీనియర్ ఆటగాడు కుమార సంగక్కర (102 బంతులో 76; 6 ఫోర్లు; 1 సిక్స్) తనదైన జోరును మరోసారి ప్రదర్శించడంతో... సోమవారం షేర్ ఎ బంగ్లా మైదానంలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక 129 పరుగుల తేడాతో నెగ్గింది. 

బోనస్ పాయింట్‌తో మొత్తం 13 పాయింట్లకు చేరిన లంక ఫైనల్‌కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంక 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 253 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ (41 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు), కుషాల్ పెరీరా (49 బంతుల్లో 33; 4 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. 83 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన లంకను చండిమాల్ (41 బంతుల్లో 26; 1 ఫోర్)తో కలిసి సంగ ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. మాథ్యూస్ చెలరేగడంతో చివరి పది ఓవర్లలో లంక 129 పరుగులు సాధించింది. మిర్వాయిస్ అష్రాఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం లక్ష్యఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 38.4 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ నబీ (43 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఏడుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన అఫ్ఘాన్... చివర్లో మూడు పరుగుల వ్యవధిలో ఆఖరి ఐదు వికెట్లను కోల్పోయింది. పెరీరా, మెండిస్‌లు మూడేసి వికెట్లు.. లక్మల్, డి సిల్వలు రెండేసి వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంగక్కరకు లభించింది.
 
 

మరిన్ని వార్తలు