ఆ రచ్చ ఇప్పుడెందుకో..?

7 May, 2020 13:23 IST|Sakshi

మీ స్వలాభాల కోసం నాపై విమర్శలా: అక్రమ్‌

కరాచీ: తాను క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి దాదాపు 17 ఏళ్లు అయ్యిందని ఇంకా తనను వివాదాల్లోకి లాగడానికి వెనుక కారణాలు ఏమిటో అర్థం కావడం లేదని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ మండిపడ్డాడు. తనపై ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేస్తున్నారని ధ్వజమెత్తాడు.ఇటీవల అమిర్‌ సొహైల్‌ చేసిన వ్యాఖ్యలు తనను మరింత నైరాశ్యంలోకి నెడుతున్నాయని అక్రమ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.  1992లో పాకిస్తాన్‌ తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత మరో వరల్డ్‌కప్‌ గెలవకపోవడానికి  వసీం అక్రమ్‌ కెప్టెన్సీ వైఫల్యమే కారణమని అమిర్‌ సొహైల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 1996, 1999, 2003 వరల్డ్‌కప్‌ల్లో అక్రమ్‌ పాకిస్తాన్‌ కెప్టెన్‌గా చేయడాన్ని సొహైల్‌ ప్రస్తావించాడు. (పొలార్డ్‌లో నిజాయితీ ఉంది: బ్రేవో)

‘పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు మరో వరల్డ్‌కప్‌ రాకుండా చేయడమే అక్రమ్‌కు అప్పట్లో లక్ష్యం. అక్రమ్‌కు దేశం పట్ల అంకితభావం ఉంటే పాక్‌ 1996, 1999, 2003 వరల్డ్‌కప్‌లు నెగ్గేది. ఒక కారణంతో ఈ నాటకమంతా జరిగింది. 1995లో పాక్‌కు రమీజ్‌ రాజా కెప్టెన్‌గా ఉన్నాడు. అంతకుముందు సలీమ్‌ మాలిక్‌ పాక్‌కు సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా ఎంతో విజయవంతమైన మాలిక్‌ను కొనసాగించివుంటే అసలు అక్రమ్‌ కెప్టెన్‌ అయ్యేవాడేకాదు. మూడు వరల్డ్‌కప్‌లకు కొంతకాలం  ముందు మాత్రమే అక్రమ్‌ కెప్టెన్‌ అయ్యేవాడు. ఎందుకంటే పాక్‌కు మరో వరల్డ్‌కప్‌ ఉండకూడదనే ఉద్దేశంతోనే. పాక్‌కు వరల్డ్‌కప్‌కు  సాధించిన ఘనత తన గురువు (ఇమ్రాన్‌ పేరును నేరుగా ప్రస్తావించలేదు)పేరిట మాత్రమే ఉండాలనే కారణం.దీనిపై విచారణ జరిపించాలి’ అని ఈ పాక్‌ మాజీ ఓపెనర్‌ డిమాండ్‌ చేశాడు.(‘భారత్‌తో డబ్యూటీసీ వద్దు.. యాషెస్‌ పెట్టండి’)

మరిన్ని వార్తలు