కోచ్ ఎంపికకు మరో 2 నెలలు!

23 May, 2016 01:25 IST|Sakshi

జూన్ 10 వరకు దరఖాస్తులు
 
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ వేగవంతం చేసింది. అర్హత, ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ అందుకు జూన్ 10 వరకు గడువు విధించింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, క్రికెట్ సలహా కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించారు. దరఖాస్తులు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చు. ఫలితంగా వచ్చే నెల 11నుంచి జరగనున్న జింబాబ్వే పర్యటనకు జట్టు కోచ్ లేకుండా వెళ్లనుంది.

ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ వరకు కోచ్‌ను ఎంపిక చేస్తారు. ప్రధాన కోచ్‌తోపాటు ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌లను కూడా బోర్డు కొత్తగా ఎంపిక చేయనుంది. మరోవైపు లోధా కమిటీ సిఫారసుల వల్ల బీసీసీఐ పరిపాలనలో ఇబ్బంది ఎదురు కాదని, ప్రతీ చోట మంచి, చెడు రెండూ ఉంటాయని గంగూలీ అభిప్రాయపడ్డారు.

వంటవాడు కూడా...: భారత క్రికెట్ జట్టుతో తొలిసారి విదేశీ పర్యటనకు ఒక వంట చేసే వ్యక్తిని కూడా పంపించనున్నారు. విండీస్‌తో సిరీస్ నుంచి జట్టుతో పాటు వంటవాడు ఉంటాడు.

మరిన్ని వార్తలు