గెలిస్తేనే టీమిండియాకు ఫైనల్ చాన్స్!

26 Jan, 2015 17:03 IST|Sakshi
గెలిస్తేనే టీమిండియాకు ఫైనల్ చాన్స్!

సిడ్నీ: ముక్కోణపు సిరీస్లో భారత్కు మరో సవాల్ ఎదురవుతోంది. రిపబ్లిక్ డే రోజున టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో గెలవడం చాలా కీలకం. ధోనీసేన చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.

ముక్కోణపు సిరీస్లో ఓటమెరుగని ఆసీస్ (13 పాయింట్లు) హ్యాట్రిక్ విజయంతో ఫైనల్కు దూసుకెళ్లగా, మరో బెర్తు కోసం భారత్ (0), ఇంగ్లండ్ (5) పోటీ పడుతున్నాయి. భారత్కు రెండు మ్యాచ్లు మిగిలివుండగా, ఆసీస్, ఇంగ్లండ్ ఓ మ్యాచ్ మాత్రమే ఆడాలి.  ఈ సిరీస్లో భారత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా ప్రత్యర్థికి బోనస్ పాయింట్ సమర్పించుకుంది. దీంతో భారత్ ఫైనల్ చేరాలంటే ఆసీస్, ఇంగ్లీష్ మెన్తో జరిగే రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గాలి. ఒకవేళ ఆసీస్తో మ్యాచ్లో ధోనీసేన ఓడితే ఇంగ్లండ్పై బోనస్ పాయింట్తో గెలిస్తేనే ఫైనల్ అవకాశముంటుంది. ప్రస్తుతం టీమిండియా ఫామ్ చూస్తే బోనస్ పాయింట్ అటుంచి గెలిస్తే చాలు అన్నట్టుగా ఉంది. అందులోనూ భారత్ కంటే ఇంగ్లండ్ కే ఎక్కువ రన్ రేట్ ఉంది. దీంతో కంగారూలతో మ్యాచ్ ధోనీసేనకు చావోరేవో లాంటిది. ఆస్ట్రేలియా చివరి మ్యాచ్లోనూ గెలిచి సమరోత్సాహంతో ఫైనల్ దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.

భారత్, ఆసీస్ బలాబలాలను పరిశీలిస్తే సొంతగడ్డపై కంగారూలే ఫేవరేట్! బౌలింగ్లో ఆసీస్కు తిరుగులేకపోగా.. భారత్ను బలహీనతలు వెంటాడుతున్నాయి. ఇక బ్యాటింగ్లనూ టీమిండియా సమస్యలు ఎదుర్కొంటోంది. సమష్టిగా రాణించడంలో విఫలమవుతున్నారు. కీలక వన్డే ప్రపంచ కప్ ముందు ధోనీసేన బలహీనతలను అధిగమించాల్సిన అవసరం ఎంతో ఉంది.

జట్లు:

భారత్: రహానె, ధవన్, రాయుడు, కోహ్లీ, రైనా, ధోనీ (కెప్టెన్/కీపర్), అక్షర్ పటేల్, బిన్నీ/అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్/ఉమేష్/షమీ (ముగ్గురిలో ఇద్దరు)

ఆస్ట్రేలియా: ఫించ్, వార్నర్, బెయిలీ (కెప్టెన్), స్మిత్, మ్యాక్స్వెల్, మార్ష్/సంధు, హాడిన్ (కీపర్), ఫాల్కనర్, స్టార్క్, హజ్లెవుడ్, డోహర్టీ

సిడ్నీలో కంగారూలే: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఆసీస్ ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడగా, టీమిండియా ఓ మ్యాచ్ మాత్రమే నెగ్గింది.

వర్ష సూచన: ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది.

మ్యాచ్ సమయం: ఉదయం 8:50 గంటల నుంచి

మరిన్ని వార్తలు