టెస్టు చరిత్రలో స్పెషల్‌ రికార్డు

26 May, 2017 12:19 IST|Sakshi
టెస్టు చరిత్రలో స్పెషల్‌ రికార్డు
హైదరాబాద్‌: టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ లో నలుగురు సెంచరీలు చేయడమే అరుదు. అటువంటిది వరుసగా నలుగురు ఆటగాళ్ల శతకాలతో ప్రత్యర్థిపై ముప్పేట దాడి చేస్తే ఎలా ఉంటుంది. 2007లో మే 25 నుంచి 27వ తేదీ వరకూ బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు వరుస నాలుగు సెంచరీల నమోదు చేసి తొలిసారి కొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం భారత జట్టు రికార్డును నమోదు చేసిన సందర్భంగా ఆ మ్యాచ్ను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం.  బంగ్లాదేశ్‌లోని మిర్పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ లో ఓపెనర్లు దినేష్‌ కార్తీక్‌(129), వసీం జాఫర్‌(138) శతకాలతో మెరవగా, ఆ పై వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ద్రావిడ్‌(129) సెకండ్ డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌(122)లు సెంచరీలతో చెలరేగిపోయారు.
 
ఈ మ్యాచ్‌ లో మరో విశేషమేమిటంటే... 175 పరుగుల వద్ద కార్తీక్‌ గాయంతో రిటైర్డ్‌ అవుట్‌గా మైదానం వీడగా క్రీజులో ఉన్న జాఫర్‌ ద్రావిడ్‌తో ఆడుతూ సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికి జాఫర్‌ కూడా గాయంతో రిటైర్ట్‌ అవుట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 281 పరుగులు చేసింది. తర్వాత సచిన్‌, ద్రావిడ్‌లు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్‌ తొలివికెట్‌ కు 408 పరుగులు చేసింది.
 
ద్రావిడ్‌ అవుటవ్వడంతో వినూమన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ పేరిట ఉన్న 413 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్య రికార్డును 5 పరుగుల దూరంలో చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్‌ సెంచరీ చేయడంతో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డు నమోదు అయింది. ఈమ్యాచ్‌ లో భారత్‌ ఇన్నింగ్స్‌, 239 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇషాంత్‌ శర్మకు తొలి మ్యాచ్‌ కావడం మరో విశేషం.
మరిన్ని వార్తలు