ఇక ఠంచన్‌గా పింఛన్‌  

2 Jul, 2018 07:11 IST|Sakshi
ఆలేరులోని పోస్టాఫీస్‌ వద్ద పింఛన్ల కోసం లబ్ధిదారుల నిరీక్షణ(ఫైల్‌) 

రాయగిరి గ్రామానికి చెందిన ‘ఆసరా’లబ్ధిదారులు పింఛన్‌ డబ్బుల కోసం మండల కేంద్రంలోని పోస్టాఫీసుకు వచ్చారు. తీరా అక్కడి సిబ్బంది డబ్బు లేదన్నారు. చేసేది లేక వారంతా వెనుదిరిగారు. మరుసటి రోజు మళ్లీ వచ్చారు. గంటల తరబడి నిరీక్షిస్తే కానీ, పింఛన్ల పంపిణీ మొదలుపెట్టలేదు. ఉన్న కొద్దిపాటి నగదు కొందరికే వచ్చింది. దీంతో మిగిలిన వారు నిరాశతో ఇంటిముఖం పట్టారు... ఇలా పింఛన్‌ డబ్బుల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడుతున్న కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఈ నెల నుంచి బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి.  

సాక్షి, యాదాద్రి : ఆసరా పథకం ద్వారా పింఛన్‌ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కష్టాలు తీరే రోజులు వచ్చాయి. తపాలా కా ర్యాలయాల ద్వారా కాకుండా  లబ్ధిదారుల బ్యాం కు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనికి సంబంధించి కొన్నాళ్ల క్రితమే ఆదేశాలు వచ్చినప్పటికీ ఈ నెలనుంచే అమలు చేసేం దుకు  అధికారులు చర్యలు చేపట్టారు.

ఎందుకంటే..
ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛన్‌ డబ్బులు చేతికందాలి. ఈ డబ్బును ప్రస్తుతం తపాలా కార్యాలయాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లకు బ్యాంకుల నుంచి డ బ్బు వస్తే తప్ప పంపిణీ చేయలేని పరిస్థితి. కానీ, బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా పోస్టాఫీస్‌ లకు డబ్బు చేరడం లేదు. దీంతో ఒక్కోసారి రెం డు నెలలు కూడా పింఛన్‌ అందడం లేదు. పింఛన్‌ కోసం లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి క్యూలో నిలబడడం, తెల్లవారుజాము నుంచి పడిగాపులు గాయడం జరుగుతుంది. వీటికి తోడు ఇంటర్‌నెట్‌ సిగ్నల్స్‌ అందకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో సిగ్నల్స్‌ కోసం భవనాలపైకి, ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. ఇలాంటి తరుణంలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని నివారించేందుకు లబ్ధిదారుల ఖాతాల్లోనే పింఛన్‌ డబ్బు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు అదేశాలు అందాయి. వచ్చే నెల నుంచి అమలు చేయడానికి చర్యలు చేపట్టారు.

ఆధార్, మొబైల్‌ నంబర్‌ తప్పనిసరి
జిల్లా వ్యాప్తంగా ఆసరా పింఛన్‌దారులు 92,934 మంది ఉన్నారు. వీరందరికీ పోస్టాఫీసుల ద్వారా ప్రతి నెలా రూ.11కోట్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పోస్టాఫీసుల్లో పింఛన్లు పంపిణీ చేయకుండా లబ్ధిదారులు ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. లేని వారికి జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ బ్యాంకు అధికారులను ఇటీవల  ఆదేశించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం, లబ్ధిదారులు సెల్‌ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. దీంతో బ్యాంకుల్లో పింఛన్‌ జమ కాగానే ఆసమాచారం లబ్ధిదారుల సెల్‌కు మెసేజ్‌ వస్తుంది. దీని వల్ల పింఛన్‌దారుల కష్టాలను గట్టెక్కించడానికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు