‘ఉత్తరాన్ని’ ముంచెత్తుతున్న వాన

11 Jul, 2016 03:31 IST|Sakshi
‘ఉత్తరాన్ని’ ముంచెత్తుతున్న వాన

తడిసి ముద్దవుతున్న ఉత్తర తెలంగాణ
- ఆదిలాబాద్‌లో స్తంభించిన జనజీవనం
- బెజ్జూరులో 25 సెంటీమీటర్ల వర్షపాతం
- జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు
- కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంల్లోనూ...
- నిలిచిన 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి
 
 సాక్షి, మంచిర్యాల/కరీంనగర్ అగ్రికల్చర్/ఇందూరు/భద్రాచలం/హైదరాబాద్:
 మూడు రోజులుగా ముంచెత్తుతున్న వర్షాలతో ఉత్తర తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఆదివారం జిల్లాలో సగటు వ ర్షపాతం 6.94 సెంటీమీటర్లుగా నమోదైంది. బెజ్జూరు మండలంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రాణహిత ఉప్పొంగడంతో వేమనపల్లి మండలం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. బెజ్జూరు మండలంలో తీగలబర్రె వాగు ఉప్పొంగడంతో కాగజ్‌నగర్-బెజ్జూర్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 64 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. 16 గ్రామాల ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. భారీ వరదనీటితో ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ప్రాణహిత, పెన్‌గంగ, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతుండడంతో నది పరీవాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సారంగాపూర్‌లోని స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. నేరడిగొండ మండలం వాంకిడి వద్ద తాత్కలిక వంతెన వర్షానికి కొట్టుకుపోయింది. భీమిని మండలంలో బిట్టూర్‌పల్లి వాగు ఉప్పొంగడంతో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. నిర్మల్ , భైంసా, మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల తో సహా పలుచోట్ల ఇళ్లు కూలాయి. ఆది లాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

 కరీంనగర్, నిజామాబాద్‌ల్లోనూ...
 కరీంనగర్ జిల్లాలోనూ రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నారుు. దాంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నారుు. సుమారు 17 లోతట్టు గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు. రామగుండంలోని సింగరేణి నాలుగు ఓపెన్‌కాస్ట్ గనుల్లో 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎల్లంపెల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 800 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 150 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా 690 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

 భద్రాద్రి వద్ద గోదారి పరవళ్లు
 ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం రాత్రి 23.3 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఎగువ వర్షాలకు తోడు బాసగూడ, కాళేశ్వరం, ఇంద్రావతిల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. చర్ల తాలిపేరు ప్రాజెక్టు నాలుగు గేట్లు 2 అడుగుల మేర ఎత్తి, 6 వేల క్యూసెక్కుల నీటి ని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద గోదావరి నీరు రహదారిని ముంచెత్తటంతో అటువైపు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఆదివారం 8.10 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఇది ఇంకా పెరగవచ్చని అంచనా.

మరిన్ని వార్తలు