కరోనాతోనే మధుసూదన్‌ మృతి

6 Jun, 2020 03:24 IST|Sakshi

హైకోర్టుకు తెలిపిన అడ్వొకేట్‌ జనరల్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన అల్లంపల్లి మధుసూదన్‌  మే 1న కరోనా కారణంగా మరణించారని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ హైకోర్టుకు తెలియజేశారు. తన భర్త మధుసూదన్‌ కు పాజిటివ్‌ వచ్చిందని గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లాక అతని ఆచూకీ తెలియడం లేదని భార్య మాధవి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

మధుసూదన్‌  మరణించిన సమాచారాన్ని తెలియజేద్దామంటే అప్పుడు ఆయన భార్య పిల్లలు క్వారంటైన్‌ లో ఉన్నారని ఏజీ తెలిపారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులే అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. అంత్యక్రియల వీడియో రికార్డు, చితాభస్మం, మరణ ధ్రువీకరణ పత్రాలను పిటిషనర్‌కు అధికారులు అందజేస్తారని తెలిపారు. వీటిని పిటిషనర్‌కు అందజేసిన సమాచారాన్ని ఈ నెల 9న జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

మరిన్ని వార్తలు