ద్రవ్య లోటును అధిగమిస్తాం

9 Mar, 2020 02:54 IST|Sakshi
భూములు, నిరర్థక ఆస్తుల విక్రయంతో అదనపు ఆదాయ సమీకరణ చేస్తాం. నిబంధనల మేరకే అప్పులు తీసుకున్నాం. ఇక పాలనపైనే పూర్తి దృష్టి పెడతాం. బడ్జెట్‌ సమర్పించాక మీడియాతో హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లా కేంద్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా పుంజుకున్నందున డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ద్వారా ఇతర రూపాల్లో ప్రభుత్వ భూములు, నిరర్థక ఆస్తులు, రాజీవ్‌ స్వగృహ ఇళ్లు విక్రయించి ఆదాయ సామర్థ్యాన్ని పెంచుకుంటామని మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం బడ్జెట్‌ సమర్పణ అనంతరం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో కలసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూముల అమ్మకంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు అనుగుణంగానే సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రానికి చెందిన విలువైన భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. రెండు నెలల క్రితం మద్యం ధరలు పెరిగినందున, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ మేరకు ఎక్సైజ్‌ ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీంతో పాటు ద్రవ్య లోటును సొంత ఆదాయం పెంచుకోవడం, వ్యవస్థలోని లోపాలను పూడ్చుకోవడం, ఇతరత్రా రూపాల్లో భర్తీ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకుందని, హైదరాబాద్‌లో రియల్‌ వ్యాపారానికి భారీగా డిమాండ్‌ ఉన్నందున, ఆదాయం కోసం భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

అనుకున్న ఫలితాలు సాధిస్తాం..
భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికలు లేనందున, ఇకపై పూర్తిగా కేబినెట్, అధికార యంత్రాంగం పరిపాలనపై పూర్తి దృష్టి పెట్టి అనుకున్న ఫలితాలను సాధిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌ చెప్పారు. కేంద్రం నుంచి టాక్స్‌ డివల్యూషన్‌ కింద 2019–20లో రాష్ట్రానికి రావాల్సింది భారీగా తగ్గిందని, 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు 2020–21లో రావాల్సిన మేర గ్రాంట్లు, వనరులు రాలేదన్నారు. జీఎస్టీ చెల్లింపుల్లో భాగంగా కేంద్రం నుంచి రూ. 2,600 కోట్లే వచ్చాయని, ఇంకా రూ. 933 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి జీఎస్టీ కంపన్సేషన్‌ రావాల్సిన నిధుల కోత ఉన్నా, గతేడాదితోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా సంక్షేమానికి కోతలు పెట్టలేదన్నారు. సంక్షేమానికి నిధుల కేటాయింపుతోపాటు ఈ బడ్జెట్‌లో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు పెట్టాలనేది పెద్ద నిర్ణయమన్నారు. కాళేశ్వరం వల్ల 150 కి.మీ. పొడవునా గోదావరి పారుతున్నందున రూ. 300 కోట్లతో గోదావరి రివర్‌ ఫ్రంట్‌ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

కేంద్రమంత్రే ఆ విషయాన్ని చెప్పారు..
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే తెలంగాణ అప్పులు తీసుకుందని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొనడాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పటికే భారీగా అప్పులు చేశారని, ఇంకా చేస్తున్నారని రాజకీయంగా వస్తున్న విమర్శలకు ఇదే తగిన సమాధాన మన్నారు. ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్‌ సరిగా జరగలేదని కాగ్‌ తెలిపిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పంపిణీ తప్పుగా జరిగిందని, తెలంగాణకు రూ.2,300 కోట్ల మేర అన్యాయం జరిగినట్లు వెల్లడించిందన్నారు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌ ఇప్పటికే లేఖలు రాసినందున,ఈ మేరకు రాష్ట్రానికి డబ్బు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు