బస్సులో మంటలు:26 మంది సజీవదహనం

20 Jul, 2016 08:26 IST|Sakshi
బస్సులో మంటలు:26 మంది సజీవదహనం

తైపీ: బస్సులో బయలుదేరిన వారంతా కొద్దిసేపట్లో విమానాశ్రయానికి చేరుకునేవారు.. ఒకటి, రెండు గంటల్లో ఎవరింటికి వారు వెళ్లిపోయేవారు. కానీ వారిని అగ్ని.. గండంలా చుట్టుముట్టింది. డ్రైవర్ సహా 26 మంది ప్రయాణికులను దహించివేసింది. ఫసిపిక్ ద్వీప దేశం తైవాన్ లో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైవే మీదుగా తాయుయాన్ విమానాశ్రయానికి వెళుతున్న టూరిస్ట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కనీసం డోర్లు తెరిచేంత అవకాశం లేకుండా అగ్నికీలలు బస్సును చుట్టుముట్టాయి.

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అరగంట తర్వాత గానీ మంటలను  పూర్తిగా అదుపు చేయలేకపోయారు. పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రవేశద్వారం వద్ద మృతదేహాలు కుప్పలుగా పడి ఉండటాన్ని బట్టి.. వారంతా బయటకు వచ్చే ప్రయత్నం చేసుంటారనే నిర్ధారణకు వచ్చినట్లు పోలీస్ క్లూస్ టీమ్ సభ్యులు చెప్పారు. చనిపోయిన వారిలో 16 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారని, వీరంతా చైనాకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగటానికి ముందు బస్సు రోడ్డుకు ఒక పక్కగా వెళ్లిందని, అలా ఎందుకు వెళ్లిందీ, మంటలు ఎలా చెలరేగిందీ ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు