వీడని మిస్టరీ.. | Sakshi
Sakshi News home page

వీడని మిస్టరీ..

Published Tue, Jul 19 2016 10:43 PM

వీడని మిస్టరీ..

జాస్మిన్, శ్రీసాయి మృతిపై విచారణ ముమ్మరం
జాస్మిన్‌ మృతి  కేసులో నిందితుడు పవన్‌ చెబుతున్న ఆంశాలపై పోలీసుల దృష్టి
జాస్మిన్‌ సోదరుడు, బంధులను గోప్యంగా విచారణ చేస్తున్న పోలీసులు
బయటకు రాని పోస్టుమార్టం రిపోర్టు 
 
రేపల్లె: నియోజకవర్గ పరిధిలోని నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్న షేక్‌ జాస్మిన్, వేముల శ్రీసాయిల మృతి మిష్టరీ వీడలేదు. జాస్మిన్‌ మృతి సంఘటనలో నిందితులుగా ఉన్న వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్‌లను చెట్టుకుకట్టేసి జాస్మిన్‌ బంధువులు గాయపరచగా శ్రీసాయి మృతి చెందాడు. జాస్మిన్‌ బంధువులు తీవ్రంగా కొట్టటం వల్లే శ్రీసాయి మృతి చెందాడని స్పష్టంగా పోలీసులు నిర్ధారించారు. శ్రీసాయి మృతి కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరికొంత మందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. శ్రీసాయి మృతి కేసులో విచారణ ఒక కొలిక్కి వచ్చినట్లేననే వాదలు వినిపిస్తున్నాయి. అయితే జాస్మిన్‌ మృతి మిస్టరీ పోలీసు వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. జాస్మిన్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు జాస్మిన్‌ మృతి  కేసులు మరో నిందితుడిగా ఉన్న జొన్న పవన్‌కుమార్‌ చెబుతున్న వివరణపై పోలీసులు దృష్టి సారించారు. పవన్‌కుమార్‌ చెబుతున్నట్లు ఆదివారం జాస్మిన్‌ తన పుట్టిన రోజని, ఇంట్లో ఎవరు లేరని, ఇంటికి రావాలని  శ్రీసాయికి జాస్మిన్‌ స్నేహితురాలితో ఫోన్‌ చేసిందని చెబుతున్నాడు. జాస్మిన్, శ్రీసాయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం వాస్తవం అని, దీంతో శ్రీసాయి తనను వెంటపెట్టుకుని జాస్మిన్‌ ఇంటికి వెళ్లాడని తెలుపుతున్నాడు. జాస్మిన్‌ ఇంటి నుంచి నేను, జాస్మిన్‌ స్నేహితురాలు బయటకు వెళ్లిపోయామని, ఇంట్లో శ్రీసాయి, జాస్మిన్‌ ఉన్న సమయంలో గౌస్‌ తలుపు కొట్టగా శ్రీసాయిని వెనుక డోర్‌ నుంచి పంపించి వేసిందని వివరించాడు. కొద్దిసేపటికి జాస్మిన్‌ ఫోన్‌ చేసి నీవు ఇంటికి వచ్చిన విషయం గౌస్‌ చూసి మాఅన్నకి ఫోన్‌ చేసి చెప్పాడని, మా అన్న నాకు ఫోన్‌ చేసి తిట్టి చావమన్నాడని ఇక నాకు బతకాలని లేదని చనిపోతున్నానని శ్రీసాయికి ఫోన్‌లో చెప్పింది. వెంటనే శ్రీసాయి, నేను జాస్మిన్‌ స్నేహితురాలిని కలిసి విషయం చెప్పి వెళ్లి ఏమి చేస్తుందో చూసిరమ్మని పంచాం, అమె ఇంట్లోకి చూసే సరికి ఇంటో జాస్మిన్‌ ఫ్యాన్‌కు ఉరిపెట్టుకుని ఉన్నట్లు వచ్చి చెప్పినట్లు, వెంటనే జాస్మిన్‌ ఇంటికి వెళ్తూ పక్కనే ఉన్న ఇద్దరు వృద్ధులకు విషయం చెప్పి, ఇంట్లోకి వెళ్లి జాస్మిన్‌ ఉరి పోసుకున్న చిరను శ్రీసాయి ఒక్కడే తొలగించి, 108కు ఫోన్‌ చేశాడని చెబుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన జాస్మిన్‌ బంధువు గౌస్‌ తమను ఇంటిలోకి నెట్టి ఇంటి తలుపులకు గడియపెట్టినట్లు చెబుతున్నాడు. పవన్‌కుమార్‌ చెబుతున్న అంశంపై పోలీసులు దృష్టి సారించి లోతుగా విచారణ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు  జాస్మిన్‌ శ్రీసాయి ఫోన్‌ చేసిందని స్పష్టంగా చెబుతున్న పవన్‌ మాటలు, ఇంటి పక్కన వృద్ధులకు విషయం చెప్పి శ్రీసాయి ఒక్కడే జాస్మిన్‌ను ఉరితాడు నుంచి తప్పించినట్లు చెబుతున్న మాటలు, జాస్మిన్‌ ఉరివేసుకుందని జాస్మిన్‌ స్నేహితురాలు తొలిగా చూసి తమకు చెప్పినట్లు చెబుతున్న మాటలు, జాస్మిన్‌ ఇంటిలోనికి వెళ్లినప్పుడు తాలుపులు పగలగొట్టుకుని వెళ్లారా, లేదా తలుపులు తీసిఉన్నాయా అనే అంశాలాపై పోలీసులు దృష్టి సారించారు. 
 
పోస్టుమార్టం రిపోర్టుపై పలురకాల చర్చలు..
జాస్మిన్‌ పోస్టుమార్టం రిపోర్టుపై ప్రజల్లో పలు చర్చలు కొనసాగుతున్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు వైద్యాధికారుల నుంచి అందలేదని మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని పోలీసులు వర్గాల నుంచి వినిపిస్తున్నది. అయితే పోస్టుమార్టం రిపోర్టులో జాస్మిన్‌ కాలర్‌బోన్‌ విరిగి ఉందని, తలకు గాయం ఉందని, జాస్మిన్‌పై అత్యాచారం జరగలేదని ప్రజల్లో ఒక వాదన వినిపిస్తున్నది. జాస్మిన్‌ శరీరానికి ఎటువటి గాయం లేదని, జాస్మిన్‌పై ఎటువంటి అత్యచారం జరగలేదనే మరో  వాదన వినిపిస్తున్నది. అయితే పోలీసులు ప్రత్యేక బలగాలతో విభిన్న కోణాల మద్య విచారణ నిర్వహిస్తున్నారు. 
డీఎస్పీ పి.మహేష్‌ వివరణ..
జాస్మిన్, శ్రీసాయి మృతి సంఘటనలపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నాం. జాస్మిన్, శ్రీసాయి మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టు అందలేదు. రెండు కేసుల్లో అన్ని కోణాల్లో విచారణ కొనసాగించి నిందితులను గుర్తించి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటాం.
 

Advertisement
Advertisement