బీజేపీ విజయం రూపాయికి బలమా?

13 Mar, 2017 09:49 IST|Sakshi
బీజేపీ విజయం రూపాయికి బలమా?
ముంబై :  ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ ఘన విజయం రూపాయికి బలం చేకూర్చనుందా? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. బీజేపీ విక్టరీ మార్కెట్లను కొత్త శిఖరాలను తీసుకెళ్లడమే కాకుండా, రూపాయికి బలపడటానికి మరింత సహకరించనుందట. ఈ విక్టరీతో ప్రధాని మోదీకి తమ సంస్కరణల అమలుకు మార్గం సుగుమమైంది. దీంతో విదేశీ పెట్టుబడులు భారతదేశానికి భారీగా వెల్లువెత్తనున్నాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఈ పెట్టుబడులు రూపాయి విలువను బలపరుస్తాయని చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా డాలర్ విలువ భారీగా బలపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.  పెట్టుబడిదారులు కూడా అమెరికాపై ఎక్కువ దృష్టిపెట్టారు. దీంతో కొన్నాళ్లు గ్రీన్ బ్యాక్ కరెన్సీకి వ్యతిరేకంగా రూపాయి పతనమైంది. అత్యంత కీలక రాష్ట్రమైన యూపీలో బీజేపీ గెలుపు అనంతరం రూపాయి విలువ బలపడి 66కు వచ్చి చేరుతుందని  ఎకనామిక్ టైమ్స్ పోల్ లో వెల్లడైంది.
 
ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు మార్కెట్లో రూపాయి విలువ శుక్రవారం 66.61గా ముగిసింది. శనివారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ గెలుపు మోదీ రాజకీయ బేస్ ను మరింత బలపరుస్తుందని, రాజ్యసభలో బీజేపీ మెజార్టినీ పెంచుతుందని విశ్లేషకులంటున్నారు. రాజకీయ స్థిరత్వంపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొందని, ఇది భారీగా పెట్టుబడులు పెట్టడానికి సహకరించనుందని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరిన్ని పవర్స్ రావడం బిజినెస్ సంస్కరణలు కూడా ఇక తేలికవుతాయని భావిస్తున్నారు. ఇతర ఎమర్జింగ్ మార్కెట్లను మించి భారత్ ప్రకాశించనుందని వెల్లడవుతోంది. 
>
మరిన్ని వార్తలు