ఫేస్బుక్, వాట్సాప్లపై సుప్రీం సీరియస్

16 Jan, 2017 16:39 IST|Sakshi
ఫేస్బుక్, వాట్సాప్లపై సుప్రీం సీరియస్
పేరెంట్ కంపెనీ ఫేస్బుక్, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.. వాట్సాప్లో పంపే సందేశాలను ఫేస్బుక్ యాక్సస్ చేస్తుందని, ఎన్ని సెక్యురిటీ ఫీచర్స్ ఉన్నా దాన్ని ఫేస్బుక్ ఉల్లంఘిస్తోందని వెల్లువెత్తిన ఫిర్యాదులపై విచారించిన సుప్రీంకోర్టు, ఆ రెండు కంపెనీలకు అక్షింతలు వేసింది. వాట్సాప్ మెసేజ్ ఎన్క్రిప్ట్ అయినా బయటకు ఎలా పొక్కుతుందని ప్రశ్నించింది. ఇది వినియోగదారుల సమాచార గోప్యతకు భంగం వాటిల్లినట్టు కాదా? అని సీరియస్ అయింది.. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ రెండు కంపెనీలకు నోటీసులు జారీచేసింది. సోషల్ మీడియాపై మీ పాలసీ ఏమిటో తెలుపాలని కూడా ఆదేశించింది. దేశంలో సోషల్ మీడియాకు ఎలాంటి విధానం ఉండాలనుకుంటున్నారో తెలుపాలంటూ ఇటు టెలికాం రెగ్యులేటరి అథారిటీ(ట్రాయ్)కి, కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది..
 
ఈ విషయంలో సమగ్రంగా పరిశోధన జరిపి, నివేదిక అందించాలని అటార్ని జనరల్ ముకల్ రోహత్గీకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. మార్కెటింగ్, కమర్షియల్ అడ్వర్టైజింగ్ కోసం తన పేరెంట్ కంపెనీ ఫేస్బుక్తో యూజర్ల డేటాను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్ కొన్ని నెలల క్రితమే ఓ కొత్త పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ తీసుకొచ్చినప్పటి నుంచి వాట్సాప్కు చిక్కులెదురవుతున్నాయి. మనదేశంలోనే కాక, ఇతర దేశాల్లోనూ ఈ పాలసీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యూజర్ల డేటాను షేర్ చేయడం వ్యక్తిగత ప్రైవసీకి భంగమని ఆరోపణలు వస్తున్నాయి. వాట్సాప్ను ఫేస్బుక్ తప్పుదోవ పట్టిస్తుందంటూ గత నెల యూరోపియన్ కమిషన్ కూడా అభిప్రాయపడింది.  యూరప్లో ఈ విషయంపై తీవ్ర ఎత్తున్న ఆందోళనలు వస్తుండటంతో, రెండు కంపెనీలు డేటా షేరింగ్ను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు ఫేస్బుక్ పేర్కొంది.  
 
మరిన్ని వార్తలు