986 కోట్లు ఆర్జించి.. 249 కోట్ల పన్ను కట్టాడు!

15 Mar, 2017 09:25 IST|Sakshi
986 కోట్లు ఆర్జించి.. 249 కోట్ల పన్ను కట్టాడు!

2005లో ట్రంప్‌ పన్ను వివరాలను వెల్లడించిన వైట్‌హౌస్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పన్ను చెల్లింపు వివరాలను తాజాగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వెల్లడించింది. 2005లో ట్రంప్‌ 150 మిలియన్‌ డాలర్లు (రూ. రూ. 986 కోట్లు) ఆర్జించి.. 38మిలియన్‌ డాలర్ల (రూ. 249 కోట్ల) పన్ను కట్టారని పేర్కొంది. ట్రంప్‌ పన్ను చెల్లింపు వివరాలను తాము రాబట్టినట్టు ఎంఎస్‌ఎన్బీసీ నెట్‌వర్క్‌ ప్రకటించిన నేపథ్యంలో వైట్‌హౌస్‌ ఈ ప్రకటన చేసింది. ట్రంప్‌ 25శాతం ఎఫెక్టివ్‌ రేటును పన్నును మాత్రమే చెల్లించారని, 100 మిలియన్‌ డాలర్ల నష్టాన్ని ఆయన లెక్కల్లో చూపించారని తన వెబ్‌సైట్‌లో ఎంఎస్‌ఎన్బీసీ వెల్లడించింది. అయితే, ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ అధిపతి అయిన డొనాల్డ్‌ ట్రంప్‌కు చట్టబద్ధంగా అవసరమైన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదని వైట్‌హౌస్‌ పేర్కొంది.

అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అత్యంత సంపన్నుడైన డొనాల్డ్‌ ట్రంప్‌ పన్ను చెల్లింపుల విషయంలో వివాదం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన భారీగా ఫెడరల్‌ ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచార సమయంలో తన పన్ను చెల్లింపు వివరాలను వెల్లడించడానికి ట్రంప్‌ నిరాకరించారు.

మరిన్ని వార్తలు