టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్య

21 Jan, 2018 07:38 IST|Sakshi

పరీక్షల భయంతోనే..!

ఏలూరు (వన్‌టౌన్‌): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల భయంతో ఓ విద్యార్థిని శనివారం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో ఆమె తల్లిదండ్రులు హతాశులయ్యారు. తీవ్రంగా రోదించారు.  రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు దక్షణపు వీధికి చెందిన కాదా హరిత(15) వన్‌టౌన్‌ ప్రాంతంలోని కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి కాదా అప్పారావు వండ్రంగి. తల్లి సత్యవతి ఇళ్లలో వంటపనిచేస్తారు. వీరు మొదటి కుమార్తెకు వివాహం చేసేశారు. హరిత రెండో కుమార్తె. చిన్ననాటి నుంచి ఆమెను గారాబంగా పెంచారు.

 హరిత మొదటి నుంచి చదువులో వెనుకబడి ఉంటోంది. కుటుంబ సభ్యులూ హరిత చదువు విషయంలో ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల విషయమై హరిత  మదనపడుతున్నట్టు చెబుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమో అంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ఏలూరు జూట్‌మిల్లు సమీపంలోని రైల్వేలైన్‌ వద్ద రైలు కింద పడి మరణించింది. ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులతోపాటు తోటి విద్యార్థులూ కన్నీరుమున్నీరయ్యారు.   ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్టు రైల్వే ఏఎస్సై పి.సైమాన్‌ తెలిపారు. బాలిక మృతదేహన్ని ఏలూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.

>
మరిన్ని వార్తలు