ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు 10 శాతం ప్రీమియం ధర

3 Nov, 2022 04:06 IST|Sakshi

టీటీడీతో సహా 11 ఆలయాలకు సరఫరాకు ఏర్పాట్లు 

ప్రస్తుత సీజన్‌ నుంచే 20 వేల టన్నుల సేకరణ లక్ష్యం 

సర్టిఫికేషన్‌ కోసం 3 సంస్థలతో రైతుసాధికార సంస్థ ఒప్పందం 

థర్డ్‌ పార్టీ ల్యాబ్‌లో రసాయన అవశేషాల నిర్ధారణ పరీక్షలు 

రసాయన రహిత ఉత్పత్తుల సేకరణ  

సాగు, సర్టిఫికేషన్‌పై రేపు ప్రకృతి వ్యవసాయ రైతులతో సమావేశం

సాక్షి, అమరావతి: లడ్డూ ప్రసాదం తయారీకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసే రైతులకు కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనంగా ప్రీమియం ధర దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపికచేసిన 100 మంది రైతులతో శుక్రవారం (ఈ నెల 4వ తేదీ) తిరుమలలోని శ్వేతభవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. లడ్డూ తయారీకి ఇప్పటికే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న శనగలను టీటీడీకి సరఫరా చేస్తున్న రైతుసాధికార సంస్థ టీటీడీతో పాటు 11 ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేయనుంది.

ఇప్పటికే ఐదు ఆలయాలతో ఒప్పందం చేసుకుంది. నిత్యం శ్రీవారికి సమర్పించే 950 కిలోల పుష్పాలతో అగరబత్తీల తయారీ, దేశీ ఆవుల ప్రోత్సాహం, ఆయుర్వేద మందుల తయారీలో గో ఆధారిత ప్రకృతి ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న టీటీడీ.. శ్రీవారికి సమర్పించే నైవేద్యంతోపాటు స్వామి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులకు నాణ్యమైన, రసాయన రహిత ప్రసాదం, ఆహారం  అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా శనగలతో పాటు 12 రకాల ఉత్పత్తులను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని రైతుసాధికార సంస్థతో కలిసి అడుగులు వేస్తోంది. బియ్యం, కంది, మినుములు, మిరియాలు, పసుపు, ఆవాలు, బెల్లం, వేరుశనగ, శనగ, చింతపండు తదితర ఉత్పత్తులు కలిపి 20 వేల టన్నులను మార్క్‌ఫెడ్‌ ద్వారా సేకరించి టీటీడీకి సరఫరా చేసేందుకు రైతుసాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఈ ఉత్పత్తులకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కోసం కృషిచేస్తునారు.

తొలివిడతగా టీటీడీకి 12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న రైతులకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సీఎస్‌ఏ, ఎస్‌ఎస్‌ఐఎస్‌ఏటీ, ఏకలవ్య వంటి ఏజెన్సీలతో రైతుసాధికార సంస్థ ఒప్పందం చేసుకుంది. నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు లిమిటెడ్‌ (ఎన్‌ఏబీఎల్‌) గుర్తింపు పొందిన థర్డ్‌ పార్టీ ల్యాబ్‌లో పరీక్షించి రసాయన రహిత ఉత్పత్తులుగా నిర్ధారణ అయిన తర్వాతే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని సంకల్పించింది.

ఇలాంటి ఉత్పత్తులకు ఎమ్మెస్పీ కంటే 10 శాతం అదనపు ప్రీమియం ధర చెల్లించనుంది. శుక్రవారం జరిగే కీలక సమావేశంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సాగులో మెళకువలతోపాటు సర్టిఫికేషన్‌ పొందేందుకు పాటించాల్సిన విధివిధానాలపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవిచౌదరి, మార్క్‌ఫెడ్‌ ఎండీ పీఎస్‌ ప్రద్యుమ్న, రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్, సీఈవో బి.రామారావు తదితరులు దిశానిర్దేశం చేయనున్నారు.     

మరిన్ని వార్తలు