పోలవరాన్ని వెంటాడుతున్న చంద్రబాబు పాపాలు

2 Feb, 2023 05:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్చూచిలా నిలిచే పోలవరం జాతీయ ప్రాజెక్టును ఇప్పటికీ చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నాయి. బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్‌లోనూ పోలవరానికి కేంద్రం నిధులను కేటాయించకపోవడానికి బాబు చేసిన పాపాలే కారణమని అధికారవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా­యి. బడ్జెట్‌లో సరిపడా నిధులను కేటాయిస్తే సత్వర­మే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. నీటి పా­రుదల ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో రూ.20,118.69 కోట్లను కేంద్రం కేటాయించింది.

ఇందులో భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.6,280.08 కోట్లు కేటాయించింది. కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయించింది. కెన్‌–బెట్వా అనుసంధానం తొలి దశ పనులకు 2022–23 బడ్జెట్‌లో రూ.1400 కోట్లు కేటాయించిన కేంద్రం... 2023–24 బడ్జెట్‌లో రూ.3,500 కోట్లు కేటాయించింది. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు 2016లో నిర్మాణ బాధ్యతలు తీసుకోకుంటే అప్పర్‌ భద్ర తరహాలోనే పోలవరానికి భారీ ఎత్తున కేంద్రం నిధులు కేటాయించేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.   

ఆదిలోనే పోలవరాన్ని నిర్వీర్యం చేసిన బాబు 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 మే 28న కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు చేపడతామని అప్పటి టీడీపీ సర్కారుకు సూచించింది.  పోలవరానికి 2014–15 బడ్జెట్‌లో రూ.250 కోట్లు, 2015–16 బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించింది. పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా చంద్రబాబు సర్కారు కాలయాపన చేస్తుండటంతో 2016–17 బడ్జెట్‌లో కేవలం రూ.వంద కోట్లే కేటాయించింది.

పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా దాటవేస్తూ వచ్చిన నాటి సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ ద్వారా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు. దాంతో 2016 సెప్టెంబరు 7 అర్ధరాత్రి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమంలో కేంద్రం పెట్టిన షరతులకూ బాబు తలొగ్గారు. దాంతో 2017–18 నుంచి బడ్జెట్‌లో పోలవరానికి కేంద్రం నిధులు కేటాయించడం లేదు.  

మరిన్ని వార్తలు