ఇక బీఎస్‌–6 ఆయిల్‌!

26 Jun, 2022 02:26 IST|Sakshi

తక్కువ కాలుష్యం.. ఎక్కువ ఇంజన్‌ సామర్థ్యం

ఉత్పత్తి హబ్‌గా మారనున్న విశాఖ హెచ్‌పీసీఎల్‌

రూ.26,264 కోట్లతో విస్తరణ, ఆధునికీకరణ పనులు

బీఎస్‌–6 వాహనాలకు అనుగుణంగా ఇంధనం సరఫరా

రిఫైనరీ సామర్థ్యం ఏడాదికి 8.3 నుంచి 15 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంపు

వచ్చే ఏడాది మార్చి నాటికి విస్తరణ పనులు పూర్తి

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత్‌ స్టేజ్‌ –6 (బీఎస్‌–6) వాహనాలు విన్నాం.. ఇక నుంచి బీఎస్‌–6 ఆయిల్‌ కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకు విశాఖ కేంద్రంగా మారనుంది. తక్కువ కాలుష్యాన్ని మాత్రమే వదులుతూ.. వాహనాల ఇంజన్‌ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బీఎస్‌–6 ఆయిల్‌ దోహదపడనుంది. దీన్ని ఉత్పత్తి చేసేందుకు విశాఖలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీ సిద్ధమవుతోంది. దేశానికి విశాఖ నుంచే బీఎస్‌–6 పెట్రోల్‌/డీజిల్‌ సరఫరా కానుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రిఫైనరీ సామర్థ్యాన్ని ఏడాదికి 8.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఎంఎంటీపీఏ) సామర్థ్యం నుంచి 15 ఎంఎంటీపీఏకు పెంచేందుకు విస్తరణ, ఆధునికీకరణ పనులను సంస్థ చేపడుతోంది. ఇందుకోసం ఏకంగా రూ.26,264 కోట్లను వెచ్చిస్తోంది. అన్నీ అనుకూలిస్తే 2023 మార్చి నాటికి విశాఖ కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బీఎస్‌–6 పెట్రోల్‌/డీజిల్‌ సరఫరా కానుంది. 

పర్యావరణహితంగా..
బీఎస్‌–6 వాహనాల తయారీ నేపథ్యంలో బీఎస్‌–6 ఆయిల్‌ను సరఫరా చేయనున్నారు. బీఎస్‌–4 వాహనాల కంటే బీఎస్‌–6 వాహనాలు తక్కువ సల్ఫర్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ను వెదజల్లుతాయి. బీఎస్‌–4 ఆయిల్‌ను వినియోగిస్తే వాతావరణంలోకి 50 పీపీఎం సల్ఫర్‌ విడుదలవుతుంది. అదే బీఎస్‌–6 ఆయిల్‌ ద్వారా అయితే ఇది కేవలం 10 పీపీఎం మాత్రమే. ఇక నైట్రోజన్‌ ఆక్సైడ్‌ బీఎస్‌–4 ద్వారా 70 శాతం విడుదలయితే.. బీఎస్‌–6 ద్వారా కేవలం 25 శాతమే విడుదలవుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా బీఎస్‌–6 ఆయిల్‌ పర్యావరణహితంగా ఉండటమే కాకుండా ఇంజన్‌ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. 

భారీ రియాక్టర్ల ఏర్పాటు..
హెచ్‌పీసీఎల్‌ విస్తరణలో భాగంగా ప్రపంచంలోనే మొదటిసారిగా భారీ రియాక్టర్లను రిఫైనరీ ఏర్పాటులో ఉపయోగిస్తున్నారు. ఈ యూనిట్‌ కోసం మూడు భారీ రియాక్టర్లు అవసరం కాగా.. ఇప్పటికే విశాఖలోని హెచ్‌పీసీఎల్‌ ప్లాంటుకు రెండు రియాక్టర్లు చేరుకున్నాయి. ఎల్‌సీ మ్యాక్స్‌ (లుమ్మస్‌ సిటీ మ్యాక్స్‌) రియాక్టర్లుగా వీటిని పిలుస్తారు. ఒక్కో రియాక్టర్‌ 67.187 మీటర్ల పొడవు, 12.2 మీటర్ల వెడల్పుతో 2,105 టన్నుల బరువు ఉంటుంది. క్రూడ్‌ ఆయిల్‌ నుంచి సల్ఫర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న బీఎస్‌–6 ఆయిల్‌ను ఉత్పత్తి చేసేందుకు ఈ భారీ రియాక్టర్లను ఉపయోగించనున్నారు. ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఈ భారీ రియాక్టర్లను సరఫరా చేస్తోంది. హెచ్‌పీసీఎల్‌ చరిత్రలోనే ఇంత భారీ స్థాయి పెట్టుబడితో రిఫైనరీని చేపట్టడం ఇదే మొదటిసారి. అలాగే ఇదే ప్లాంటులో సొంత విద్యుత్‌ అవసరాల కోసం క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంటును కూడా నెలకొల్పుతున్నారు. 

రోజుకు 3 లక్షల బ్యారల్స్‌..
వాస్తవానికి.. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ సామర్థ్యాన్ని 15 ఎంఎంటీపీఏకు విస్తరించే పనులు ముందస్తు ఒప్పందం ప్రకారం 2020 మధ్యనాటికే పూర్తి చేయాల్సి ఉంది. అయితే కోవిడ్‌ నేపథ్యంలో విస్తరణ, ఆధునికీకరణ పనులు కాస్త నెమ్మదించాయి. ఫలితంగా 2023 మార్చి నాటికి పూర్తి చేయాలని తాజాగా గడువును నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న రిఫైనరీ 8.3 ఎంఎంటీపీఏ అంటే రోజుకు 1,66,000 బ్యారళ్ల ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. విస్తరణ, ఆధునికీకరణ పనులు పూర్తయితే ఈ సామర్థ్యం (15 ఎంఎంటీపీఏ)తో రోజుకు 3 లక్షల బ్యారళ్లకు (సుమారు 4.77 కోట్ల లీటర్లు) పెరగనుంది.   

మరిన్ని వార్తలు