కృష్ణ.. కృష్ణా..  ఏమిటీ 'నిర్లిప్తత'!

27 Apr, 2021 04:53 IST|Sakshi

నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారంలో కృష్ణా బోర్డు వైఫల్యం

సీడబ్ల్యూసీకి నివేదించడం.. జాయింట్‌ కమిటీ ఏర్పాటుతో సరి

క్యారీ ఓవర్‌ జలాల సమస్య పరిష్కారానికి సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక అమలులోనూ విఫలం

అపరిష్కృతంగానే మిగిలిపోతున్న సమస్యలు

కృష్ణా జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) విఫలమవుతోందని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యను కేంద్ర జల్‌ శక్తి శాఖ, కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీకి) నివేదించడం లేదా జాయింట్‌ కమిటీ ఏర్పాటు చేయడంతో తన బాధ్యత పూర్తయిందనే రీతిలో బోర్డు వ్యవహరిస్తోందని విశ్లేషిస్తున్నారు. సమస్యపై అధ్యయనం చేసి.. పరిష్కారం కోసం సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికనూ అమలు చేయడంలోనూ బోర్డు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
– సాక్షి, అమరావతి

ఎటూ తేల్చని సమస్యలివీ..
సమస్య 1
చిన్న నీటి పారుదల విభాగంలో తెలంగాణ అధికంగా కృష్ణా నీటిని వినియోగించుకుంటోంది. చిన్న నీటిపారుదల విభాగంలో చెరువులు, కుంటలు, చిన్నతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా ఎత్తిపోతల కింద 89.90 టీఎంసీల కంటే తెలంగాణ సర్కార్‌ అధికంగా వాడుకుంటోందని, ఈ లెక్క తేల్చాలని కృష్ణా బోర్డును ఏపీ జల వనరుల శాఖ అధికారులు కోరారు. దీనిని తెలంగాణ నీటి పారుదల అధికారులు వ్యతిరేకించారు. దాంతో రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులు, బోర్డు అధికారులతో సంయుక్త కమిటీ (జాయింట్‌ కమిటీ)ని నియమించి తెలంగాణ వాడుకుంటున్న నీటి లెక్క తేలుస్తామని 2017లో బోర్డు స్పష్టం చేసింది. ఆరు నెలలు కాదు.. నాలుగేళ్లు గడిచాయి. ఇప్పటికీ 
ఆ లెక్క తేల్చలేదు.

సమస్య 2
హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే కోటా కింద పరిగణించాలని తెలంగాణ 2016లో కృష్ణా బోర్డును కోరింది. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోందని పేర్కొంది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కృష్ణా బోర్డు కోరింది. ఇప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోలేదు.

సమస్య 3
నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ కింద ప్రవాహ నష్టాలు 40 శాతం మేర ఉన్నాయని తెలంగాణ సర్కార్‌ చేసిన వాదనను ఏపీ ఖండించింది. ప్రవాహ నష్టాలు 27 శాతానికి మించవని 2019లో స్పష్టం చేసింది. ప్రవాహ నష్టాలను తేల్చేందుకు జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆరు నెలల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని కృష్ణా బోర్డు పేర్కొంది. దాదాపు రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రవాహ నష్టాలను తేల్చలేదు.

సమస్య 4
2019–20 నీటి సంవత్సరంలో కేటాయించిన నీటిలో 50.851 టీఎంసీలను వాడుకోలేకపోయామని.. వాటిని 2020–21లో వినియోగించుకుంటామని గతేడాది తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డును కోరింది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–1 తీర్పులో క్లాజ్‌–8 ప్రకారం ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని.. వాడుకోకుండా మిగిలిపోయిన జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశాన్ని సీడబ్ల్యూసీ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది. సీడబ్ల్యూసీ ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ నివేదిక ఇచ్చింది. వాడుకోకుండా మిగిలిపోయిన నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని.. వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కానీ.. సీడబ్ల్యూసీ నివేదికను అమలు చేయడంలో కృష్ణా బోర్డు జాప్యం చేస్తోంది. దాంతో.. 2020–21లో తమ కోటాలో వాడుకోకుండా మిగిలిపోయిన నీటిని 2021–22లో వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని తెలంగాణ సర్కార్‌ మళ్లీ పాత పల్లవి అందుకోవడం గమనార్హం.

సమస్య 5
కృష్ణా నదికి 2019–20లో ఎన్నడూ లేని రీతిలో భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చింది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తేసి.. వరద జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో 44 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం మళ్లించింది. ఆ సమయంలో వాటిని మళ్లించకపోతే సముద్రంలో కలిసేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సముద్రంలో వరద జలాలు కలుస్తున్న సమయంలో ఇరు రాష్ట్రాలు మళ్లించిన జలాలను.. ఆ రాష్ట్రాల కోటా కింద లెక్కించకూడదని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. దాంతో.. 2020–21 నీటి సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశం చేయాలని సీడబ్ల్యూసీని కోరింది. దీనిపై సీడబ్ల్యూసీ ఇప్పటిదాకా నివేదిక ఇవ్వకపోవడంతో.. ఆ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. 

మరిన్ని వార్తలు