రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌మార్కెట్‌పై నిఘా 

16 Apr, 2021 10:58 IST|Sakshi

గుంటూరు, నరసరావుపేటల్లో ఇంజక్షన్లు సీజ్‌

విక్రయిస్తున్న నలుగురిని పట్టుకున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు

రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచిన ఔషధ నియంత్రణశాఖ

సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్‌: రాష్ట్రంలో కోవిడ్‌ బాధితులకు ఇచ్చే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌మార్కెటింగ్‌పై అధికారులు నిఘా పెంచారు. ఈ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురిని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు పట్టుకున్నారు. ఈ ఇంజక్షన్‌ను కొందరు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఔషధ నియంత్రణశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సీ అండ్‌ ఎఫ్, హోల్‌సేల్‌ షాపులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెట్టారు. గుంటూరులో బుధవారం ఓ వ్యక్తి 6 ఇంజక్షన్లు తీసుకెళుతుండగా పట్టుకున్నారు. వాటిని సీజ్‌ చేసి పట్టుకున్న వ్యక్తిని విచారిస్తున్నారు.

అదేరోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఒక ఆస్పత్రి ఐసీయూలో రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను బయటకు తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురు మేల్‌ నర్సింగ్‌ సిబ్బందిని పట్టుకున్నారు. 7 డోసుల ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు నిఘా పెంచారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కేవలం కోవిడ్‌ అనుమతి ఉన్న ఆస్పత్రులకు మాత్రమే పంపిణీ జరగాలని, ప్రైవేటుగా ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోల్‌సేలర్లు, రిటెయిలర్లు కూడా ఇంజక్షన్ల లెక్క చెప్పాలని ఆదేశించారు. గుంటూరులో బ్లాక్‌ మార్కెట్‌లో ఇంజక్షన్ల విక్రయాల్లో వైద్యుల ప్రమేయం ఉన్నట్టు నగరంలోని వైద్యుల సంఘంలో గురువారం విస్తృతంగా చర్చ జరిగింది. 

ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు
ఇంజక్షన్లు బ్లాక్‌మార్కెట్‌లో అమ్మితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఇవి కోవిడ్‌ అనుమతి ఉన్న ఆస్పత్రుల్లో మాత్రమే అమ్మాలి. కొంతమంది ఇంజక్షన్లను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– రవిశంకర్‌నారాయణ్, డైరెక్టర్‌ జనరల్, ఔషధ నియంత్రణశాఖ
చదవండి:
టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు  
ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెమార్పిడి

మరిన్ని వార్తలు