రూ. 7,000 కోట్ల పెట్టుబడికి ‘సమర’ సిద్ధం

24 Jan, 2022 04:30 IST|Sakshi

ఫ్యూచర్‌ రిటైల్‌కు అమెజాన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌ను (ఎఫ్‌ఆర్‌ఎల్‌) రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌ సమర క్యాపిటల్‌ సిద్ధంగా ఉందని ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వెల్లడించింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌ నుంచి బిగ్‌ బజార్‌ తదితర సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా సుమారు రూ. 7,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడానికి సుముఖంగానే ఉందని తెలిపింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టర్లకు జనవరి 22న రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించింది.

రుణదాతలకు జరపాల్సిన చెల్లింపుల కోసం జనవరి 29 డెడ్‌లైన్‌ లోగా రూ. 3,500 కోట్లు సమకూర్చగలరా లేదా అన్నది తెలియజేయాలంటూ ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టర్లు గతంలో రాసిన లేఖపై అమెజాన్‌ ఈ మేరకు స్పందించింది. 2020 జూన్‌ 30 నాటి టర్మ్‌ షీట్‌ ప్రకారం రూ. 7,000 కోట్లకు ఎఫ్‌ఆర్‌ఎల్‌ వ్యాపారాలను (బిగ్‌ బజార్, ఈజీడే, హెరిటేజ్‌ మొదలైనవి) కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని సమర క్యాపిటల్‌ తమకు తెలిపిందని అమెజాన్‌ పేర్కొంది.

ఇందుకోసం ఎఫ్‌ఆర్‌ఎల్‌ వ్యాపారాలను మదింపు చేసేందుకు అవసరమైన వివరాలను సమరకు అందించాలని తెలిపింది. అయితే, సమర క్యాపిటల్‌ ఆ విషయాన్ని నేరుగా ఎఫ్‌ఆర్‌ఎల్‌కు తెలపకుండా అమెజాన్‌తో ఎందుకు చర్చిస్తోందన్న అం శంపై వివరణ ఇవ్వలేదు. సుమారు రూ. 24,713 కోట్లకు బిగ్‌ బజార్‌ తదితర వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ చేస్తున్న యత్నాలను ఎఫ్‌ఆర్‌ఎల్‌లో పరోక్ష వాటాదారైన అమెజాన్‌ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం సాగిస్తోంది. 

మరిన్ని వార్తలు