ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

25 Aug, 2021 19:36 IST|Sakshi

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్‌ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌పీఎస్‌ కింద బ్యాంకు యజమాని అందించే సహకారాన్ని పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. దీని వల్ల బ్యాంకు ఉద్యోగుల కుటుంబ పెన్షన్ పెరగనుంది. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం యూనిఫాం స్లాబ్‌లో పెన్షన్‌ పొందనున్నారు. ఇప్పటివరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్‌ రూ.30,000-35,000కు పెరగనున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) తెలిపింది.(చదవండి: కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్‌కే జై కొడుతున్నారు)

పెన్షన్ కాంట్రిబ్యూషన్ పెంపు
ఇంతకు ముందు వివిధ వర్గాల పెన్షనర్లకు 15, 20, 30 శాతం స్లాబ్‌ రేట్లలో చెల్లించాల్సిన ఫ్యామిలీ పెన్షన్‌ను ఎలాంటి క్యాప్‌ లేకుండా చూడాలని ఇండియన్‌ బ్యాంకింగ్ అసోసియేషన్‌(ఐబీఏ) ప్రభుత్వానికి నివేదించింది. వేలాది బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో ఉన్న పెన్షన్ కాంట్రిబ్యూషన్ 10 శాతం నుంచి 14 శాతానికి పెరుగుతుంది అని డీఎఫ్ఎస్ కార్యదర్శి దేబాషిష్ పాండా తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం లాభదాయకంగా మారాయని, వారు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందరని, మార్కెట్ నుంచి డబ్బును సేకరిస్తున్నారని పాండా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. "2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.26,016 కోట్ల నష్టంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.31,817 కోట్ల లాభాన్ని నివేదించాయి. ఐదేళ్ల నష్టాల తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు లాభాన్ని నివేదించడం ఇది మొదటిసారి. మార్చి 2021 నాటికి మొత్తం స్థూల నిరర్థక ఆస్తులు రూ.6.16 లక్షల కోట్లుగా ఉన్నాయి, మార్చి 2020 నుంచి రూ.62,000 కోట్లు తగ్గాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉన్న మోసల సంఖ్యతో 3,704తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో మోసాల సంఖ్య 2,903కు తగ్గినట్లు" ఆమె పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు