స్టాక్స్‌లో సిప్‌ చేయడం మంచిదేనా?

2 Aug, 2021 10:16 IST|Sakshi

ప్రతీ రంగంలోనూ 5–10 శాతం పెట్టుబడులు చొప్పున పూర్తి వైవిధ్యంతో కూడిన పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చా? లేదంటే కొన్ని రంగాల్లోకి కొన్ని స్టాక్స్‌కే పరిమితం కావాలా? ఇందులో మంచి విధానం ఏది? 
– విజయ్‌ జాదవ్‌
 

వైవిధ్యం పేరుతో అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టడం అన్నది అంత మంచి విధానం కాదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పోర్ట్‌ ఫోలియోలను పరిశీలించినట్టయితే.. వందల నుంచి వేల కోట్ల రూపాయిలను నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ వారు అన్ని రంగాల్లోనూ ఇన్వెస్ట్‌ చేయరు. స్పష్టత, ఎంపికలన్నవి కీలకం అవుతాయి. ముందుగా పెట్టుబడులకు విలువైన స్టాక్స్‌ను గుర్తించడం సరైన విధానం అవుతుంది. రిటైల్‌ ఇన్వెస్టర్‌కు 10–15 స్టాక్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియో సరిపోతుంది.

బలమైన ఆర్థిక మూలాలతో, చక్కగా వృద్ధి చెందుతున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలానికి ఆయా కంపెనీలు సరైన ఎంపిక అవ్వాలంటే.. ఆయా కంపెనీలు ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటున్నాయి తదితర అంశాలు కూడా తెలిసి ఉండాలి. ఇలా ముందు కంపెనీలను ఎంపిక చేసుకున్న తర్వాత రంగాల వారీ కేటాయింపులు చేసుకోవాలి. ఒకే రంగానికి ఎక్కువ కేటాయింపులు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి ప్రత్యామ్నాయం అవుతాయి.

స్టాక్స్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌/నిర్ణీత కాలానికోసారి కొంత చొప్పున) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానమేనా? మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌తో పోలిస్తే ఇందులో ఉన్న వ్యత్యాసం ఏంటి? 
– దుర్గేష్‌

చూడ్డానికి ఈ రెండూ ఒక్కటే. ఈక్విటీ ఫండ్‌లో సిప్‌ మాదిరే షేర్లలో నేరుగా సిప్‌ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇందుకు మంచి కంపెనీని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను కొంత కాల వ్యవధి వరకు విస్తరించడం వల్ల రిస్క్, ఆందోళన తగ్గుతుంది. అయితే, స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టయితే మీ పెట్టుబడులపై ఎప్పుడూ దృష్టి సారించి ఉండాలి. క్రమానుగతంగా స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నప్పటికీ కొంత వరకు చురుకైన నిర్వహణ విధానం అవసరమవుతుంది. సరైన సమయం, ఉత్సాహం ఉండి, వీటిన్నింటిని ఆస్వాదించేట్టు అయితే స్టాక్స్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపొచ్చు. లేదంటే మంచి మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది.

పైగా ప్రతి నెలా మీ పెట్టుబడులు రూ.5,000–10,000 మధ్యే ఉంటే యాక్టివ్‌ ఇన్వెస్టర్‌గా ఉండడం వల్ల పెద్దగా వచ్చే లాభం ఉండదు. ఇటువంటి వారు మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేవారు బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ లేదా పన్ను ఆదా ఫండ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌)తో ప్రయాణాన్ని ప్రారంభించాలి. కనీసం రెండు, మూడేళ్ల పాటైనా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించాలి. దాంతో అస్థిరతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు వైవిధ్యంతో కూడిన ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను ప్రారంభించొచ్చు.

బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌లోని పెట్టుబడులను వీటిల్లోకి మళ్లించాలి. ఆ తర్వాత మరో రెండు, మూడేళ్ల పాటు పెట్టుబడులను కొనసాగించాలి. ఇలా ఐదేళ్ల తర్వాత మార్కెట్లలో ఉద్దాన, పతనాలను అర్థం చేసుకుని, సర్దుబాటు చేసుకోవడం తెలిస్తే.. అప్పుడు కంపెనీ వార్షిక నివేదికలను అధ్యయనం చేయడం, మంచి స్టాక్‌ను ఎంపిక చేసుకోవడం ఎలా అన్నది తెలుస్తుంది. స్టాక్‌ పడిపోయినా కానీ, మీకున్న కచ్చితమైన అవగాహన, విశ్వాసంతో పెట్టుబడులను కొనసాగించగలరు. అప్పుడే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం సరైనది. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ మాత్రం నైపుణ్యాలు, అవగాహన అవసరం. పైగా ఇదంతా ఒకే విడత చేయకూడదు. నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులను 20–25 శాతంతో మొదలుపెట్టాలి. అలా ఏడాది పాటు చూడాలి. అంతా సక్రమంగానే ఉంటే అప్పుడు పెట్టుబడులను 50 శాతానికి పెంచుకోవాలి. అలా మరో ఏడాది పాటు కొనసాగించాలి.

ఆ తర్వాత పెట్టుబడులను 75 శాతానికి పెంచుకోవాలి. ఈక్విటీ పెట్టుబడులను అర్థం చేసుకునేందుకు ఇదొక క్రమానుగత విధానం అవుతుంది. దీనివల్ల పెట్టుబడుల నిర్వహణ ఫీజులను (మ్యూచువల్‌ ఫండ్స్‌లో వసూలు చేసేవి) ఆదా చేసుకోవచ్చు. ఇలా ఐదేళ్ల ప్రణాళికకు బదులు వేగంగా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తే.. అంతే వేగంగా నష్టాలకు అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగం కూడా ఆకర్షించొచ్చు. కానీ, అందులోకి ప్రవేశించొద్దు. చాలా రిస్క్‌ ఎక్కువ. ఒకవేళ అంతగా ఆకర్షిస్తే చాలా స్వల్పమొత్తానికే పరిమితం అవ్వాలి.
- ధీరేంద్ర కుమార్‌, సీఈవో , వాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు