కేంద్ర మంత్రి సీతారామన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో భేటీ

20 Aug, 2021 03:31 IST|Sakshi

ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఇరువురి భేటీకి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌పై కేంద్ర ఆర్థిక శాఖ పోస్ట్‌ చేసింది. సమావేశం వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. విక్రయదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతో(ఎంఎస్‌ఎంఈ) ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న భాగస్వామ్యం, హస్తకళాకారులకు తాము అందిస్తున్న మద్దతు గురించి కృష్ణమూర్తి వివరించారు. అలాగే, డిజిటల్‌ వేదికల ద్వారా మరింత మంది కొనుగోలుదారులకు చేరువ అవుతున్న తీరును కూడా తెలియజేశారు. ఫ్లిప్‌కార్ట్‌ వేదికపై మూడు లక్షలకు పైగా విక్రేతలు నమోదై ఉన్నారు. ఇందులో 60% మంది ద్వితీయ శ్రేణి, అంతకంటే చిన్న పట్టణాలకు చెందినవారే ఉం టారు. హోల్‌సేల్‌ వ్యాపారం ద్వారా 16లక్షల కిరాణా స్టోర్లతోనూ ఫ్లిప్‌కార్ట్‌కు భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌కు 35 కోట్ల యూజర్లున్నారు.

మరిన్ని వార్తలు