ఆ ఉత్పత్తులపై జీరో జీఎస్టీ! కానీ... మెలిక పెట్టిన జీఎస్టీ కౌన్సిల్

7 Oct, 2023 17:56 IST|Sakshi

అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meet) ముగిసింది. ఈ సమావేశంలో ఏయే నిర్ణయాలు తీసుకుంటారోనని అందరూ ఆతృతగా ఎదురుచూశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలియజేశారు.

70 శాతం కంపోజిషన్ ఉన్న చిరుధాన్యాల (millet) పొడి ఉత్పత్తులపై జీఎస్టీ ఉండదని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే బ్రాండెడ్ చిరుధాన్యాల పొడి ఉత్పత్తులపై మాత్రం 5 శాతం జీఎస్టీ విధించేలా జీఎస్టీ  కౌన్సిల్ నిర్ణయించిందని పేర్కొన్నారు.  వీటిపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ అమలు చేస్తున్నారు.

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానంతరం విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, బరువు ప్రకారం కనీసం 70 శాతం కంపోజిషన్‌తో కూడిన మిల్లెట్ పొడి ఉత్పత్తులను బ్రాండింగ్ లేకుండా విక్రయిస్తే జీఎస్టీ ఉండదని స్పష్టం చేశారు.

కాగా గతంలో జీఎస్టీ కౌన్సిల్ ఫిట్‌మెంట్ కమిటీ పొడి మిల్లెట్‌ ఉత్పత్తులపై పన్ను  మినహాయింపును సిఫార్సు చేసింది. భారత్‌ 2023ని 'చిరుధాన్యాల సంవత్సరం'గా పాటిస్తోంది. అధిక పోషక విలువలున్న చిరు ధాన్యాల పొడి ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా జీఎస్టీ మినహాయింపు, తగ్గింపులను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు