40 లక్షల కోట్ల డాలర్లకు భారత్‌!

23 Nov, 2022 02:33 IST|Sakshi

2047 నాటికి ఎకానమీ 13 రెట్లు వృద్ధి 

డిజిటలీకరణ, స్వచ్ఛ ఇంధన విప్లవాల దన్ను 

రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడి

న్యూఢిల్లీ: స్వచ్ఛ ఇంధనం, డిజిటలీకరణ విప్లవాల దన్నుతో 2047 నాటికి భారత ఎకానమీ 13 రెట్లు వృద్ధి చెందనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ధీమా తెలిపారు. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ  40 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని చెప్పారు. పండిట్‌ దీనదయాళ్‌ ఎనర్జీ విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు.

వినియోగం, సామాజిక–ఆర్థిక సంస్కరణల ఊతంతో 2050 నాటికి భారత్‌ 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదుగుతుందంటూ అదానీ గ్రూప్‌ చీఫ్‌ గౌతమ్‌ అదానీ ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో ముకేశ్‌ అంబానీ తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రస్తుతం 3 లక్షల కోట్ల (ట్రిలియన్‌) డాలర్లుగా ఉన్న భారత ఎకానమీ 2047 కల్లా 40 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుంది. ప్రపంచంలోనే టాప్‌ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఉంటుంది‘ అని అంబానీ చెప్పారు. అమృత కాలంలో దేశంలో ఆర్థిక వృద్ధి, అవకాశాలు అసాధారణ స్థాయిలో పెరుగుతాయని ఆయన తెలిపారు. (2022 – 2047 మధ్య కాలాన్ని అమృత కాలంగా వ్యవహరిస్తున్నారు. 2047 నాటికి భారత్‌కు స్వాతంత్య్రం లభించి వందేళ్లవుతుంది. 

మూడు విప్లవాల ఊతం.. 
‘రాబోయే దశాబ్దాల్లో భారత వృద్ధిలో మూడు విప్లవాలు కీలకపాత్ర పోషించనున్నాయి. అవేమిటంటే.. స్వచ్ఛ ఇంధన విప్లవం, జీవ ఇంధన విప్లవం, డిజిటల్‌ విప్లవం. పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు మొదటి రెండూ ఉపయోగపడనుండగా, ఇంధనాన్ని సమర్ధమంతంగా వినియోగించుకునేందుకు మూడోది ఉపయోగపడుతుంది. మన గ్రహాన్ని వాతావరణ సంక్షోభాల నుండి కాపాడుకోవడంలో భారత్‌కు, ప్రపంచానికి ఈ మూడూ తోడ్పడతాయి‘ అని అంబానీ చెప్పారు. 

విద్యార్థులకు విజయ సూత్రాలు.. 
విజయాలు సాధించాలంటే మూడు సూత్రాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలని విద్యార్థులకు అంబానీ సూచించారు. ఆలోచనల స్థాయి గొప్పగా ఉండాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, డిజిటలీకరణపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భారత్‌ను అంతర్జాతీయంగా స్వచ్ఛ ఇంధన లీడరుగా తీర్చిదిద్దడంలో ఈ మూడు సూత్రాలు తోడ్పడగలవని అంబానీ చెప్పారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ వర్సిటీ గవర్నర్ల బోర్డుకు అంబానీ ప్రెసిడెంటుగా వ్యవహరిస్తున్నారు.  

టాటా చంద్రశేఖరన్‌కు ప్రశంసలు.. 
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టాటా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ను ముకేశ్‌ అంబానీ ఈ సందర్భంగా ప్రశంసించారు. తన దార్శనికత, దృఢ విశ్వాసం, అపార అనుభవంతో చంద్రశేఖరన్‌ ఇటీవలి కాలంలో టాటా గ్రూప్‌ అద్భుత వృద్ధి సాధించేలా నడిపిస్తున్నారని కితాబిచ్చారు. మరోవైపు, ప్రపంచమంతా స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల ఇంధనాలకు మళ్లక తప్పదని చంద్రశేఖరన్‌ తెలిపారు. ఈ విషయంలో సారథ్యం వహించేందుకు భారత్‌కి తగు సామర్థ్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు