జీఎస్‌టీ పరిహారం మరో ఐదేళ్లు పొడిగించండి

31 Dec, 2021 06:13 IST|Sakshi

కేంద్రానికి రాష్ట్రాల డిమాండ్‌

బడ్జెట్‌ ముందస్తు సమావేశంలో పలు అంశాలపై చర్చ

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారానికి మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన  కొత్త ఆర్థిక సంవత్సరం (2022–23) బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో బడ్జెట్‌ ముందస్తు సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

జీఎస్‌టీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత వ్యాట్‌ వంటి స్థానిక పన్నులను ఉపసంహరించుకోవడం జరిగింది. దీనివల్ల ఏర్పడే ఆదాయ లోటు కోసం రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం చెల్లిస్తోంది. ఈ చెల్లింపుల గడువు వచ్చే ఏడాది జూన్‌తో ముగుస్తుంది. కరోనా కష్టకాలంలో మరో ఐదేళ్లు పరిహార కాలాన్ని పొడిగించాలని పలు రాష్ట్రాలు తాజాగా డిమాండ్‌ చేశాయి.  

పలు వర్గాలతో భేటీ...
2022–23 వార్షిక బడ్జెట్‌పై ఆర్థికమంత్రి పలు వర్గాలతో  ఈ నెల ప్రారంభం నుంచి సమావేశాలు నిర్వహిస్తూ, వారి అభిప్రాయాలను తీసుకుంటున్న  సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియల్‌ రంగానికి చెందిన నిపుణులు, కార్మిక సంఘాలు, వ్యవసాయ రంగ ప్రతినిధులు వీరిలో ఉన్నారు.  డిసెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 22 వరకూ ఎనిమిది దఫాల్లో వర్చువల్‌గా ఈ సమావేశాలు జరిగాయి. దాదాపు 120 మంది ప్రతినిధులు  చర్చల్లో పాల్గొన్నారు. 

ఆదాయపు పన్ను శ్లాబ్‌ల హేతుబద్దీకరణ, డిజిటల్‌ సేవలకు మౌలిక రంగం హోదా, హైడ్రోజన్‌ స్టోరేజ్‌కి ప్రోత్సాహకాలు వంటి ప్రతిపాదనలు వారి నుంచి కేంద్రానికి అందాయి.మోడీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి ఇది నాల్గవ వార్షిక బడ్జెట్‌. ఇక్కడి విజ్ఞాన్‌ భవల్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు తమ డిమాండ్లు ఏమిటన్నది మీడియాకు వెల్లడించారు. ఆయా అంశాలు పరిశీలిస్తే...

బంగారం దిగుమతి సుంకాలు తగ్గాలి
2027 వరకూ పరిహారం పొడిగించాలన్న రాష్ట్రాల డిమాండ్‌ సరైందే. దీనిని కేంద్రం పరిశీలించాలి. దీనికితోడు బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలి. కేంద్ర పథకాల్లో  కేంద్రం వాటా క్రమంగా తగ్గుతూ, రాష్ట్రాల వాటా పెరగాలనేది మా అత్యంత ముఖ్యమైన డిమాండ్‌. ఇంతకుముందు షేరు 90–10గా ఉండేది. మరియు ఇప్పుడు అది 50–50 లేదా 60–40గా ఉంది. అది 90–10కి తిరిగి వెళ్లాలని మా అభ్యర్థన. కోవిడ్‌ మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో ఇది అత్యవసరం. నీటిపారుదల, నీటి పనుల ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని అలాగే కేంద్ర పథకాలుగా  ప్రకటించాలని కూడా కోరుతున్నాం.
– సుభాష్‌ గార్గ్, రాజస్తాన్‌ విద్యాశాఖ మంత్రి

లేకపోతే కష్టమే...
పలు  రాష్ట్రాలు పరిహారం కొనసాగింపును కోరాయి. మేము కూడా పొడిగించమని కోరాము. పొడిగించకపోతే, అనేక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది.
మనీష్‌ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి

భారీ ఆదాయాన్ని కోల్పోతున్నాం
జీఎస్‌టీ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఆదాయానికి గండి పడింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రం దాదాపు రూ. 5 వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. దీనిని భర్తీ చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేయలేదు. కాబట్టి జీఎస్‌టీ పరిహారం మంజూరును కొనసాగించాలని కోరుతున్నాం. మూడే ళ్లలో కేంద్ర బడ్జెట్‌లో ఛత్తీస్‌గఢ్‌కు రూ.13,089 కోట్ల తక్కువ కేంద్ర పన్నుల వాటా వచ్చింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా పూర్తిగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. కోల్‌ బ్లాక్‌ కంపెనీల నుంచి బొగ్గు తవ్వకాలకు సంబంధించి టన్నుకు రూ.294 చొప్పున కేంద్రం వద్ద జమ అయ్యింది. దీనికి సంబంధించి రూ.4,140 కోట్లను కూడా వెంటనే ఛత్తీస్‌గఢ్‌కు బదలాయించాలి.
భూపేష్‌ బఘేల్, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి  

అదనపు రుణ సౌలభ్యత కావాలి
కరోనా సవాళ్లతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీనితో జీఎస్‌టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పెంచకతప్పదు. దీనితోపాటు రాష్ట్ర రుణాలకు సంబంధించి, ఎలాంటి ఆంక్షలు, పరిమితి లేకుండా అదనపు రుణాల సౌలభ్యతను కల్పించాలి.  – చంద్రిమా భట్టాచార్య,
పశ్చిమ బెంగాల్‌ పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ వ్యవహారాల మంత్రి

మరిన్ని వార్తలు