జంట హత్యలు: డబ్బుల కట్టలు ఉన్నాయని..

29 Jan, 2021 09:42 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు నిందితులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితులు నల్లగొండ పాతబస్తీ గిరకలబాయి ప్రాంతానికి చెందిన అమేర్, అజీమ్‌గా సీసీ కెమెరాలు, కాల్‌డేటా ఆధారంగా నిర్ధారించినట్లు విశ్వసనీయ సమాచారం. సంఘటన స్థలం నుంచి కాల్‌డేటాను డంప్‌ చేసి 8వేల పైచిలుకు ఫోన్‌కాల్స్‌ను వడపోయడంతో కీలక ఆధారాలు పోలీసుల చేతికి చిక్కాయి. పాత నేరస్తుడు ఆటో నడుపుతుండడంతో.. చర్లపల్లి స్మార్ట్‌ సిటీ వద్ద ఈనెల 24 అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం పోతులూరి గ్రామానికి చెందిన బోండి నాగేశ్వర్‌రావు అలియాస్‌ శశిధర్, బోండి రాంజిబాబు ఆటో ఎక్కారు. వారి వద్ద ఉన్న బ్యాగుల్లో డబ్బు కట్టలు ఉన్నాయని భావించిన ఆటోడ్రైవర్‌ అమేర్‌.. పాతబస్తీకి చెందిన అజీమ్‌ను పిలిపించుకొని హత్యకు పథకం వేశారు.

రాత్రి కావడంతో నమ్మకంగా మాటలు కలిపి మద్యం తాగించేందుకు బేగ్‌ ఫంక్షన్‌హాల్‌ వైపు ఆటోలో తీసుకెళ్లిన దృశ్యాలు పోలీసులు ఏర్పాటు చేసిన కొన్ని రహస్య సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మృతుల బ్యాగులో రూ. 500లతో పాటు రెండు జతల బూట్లు, రెండు జతల దుస్తులు ఉండగా నిందితులు వారి దుస్తులు వేసుకుని బ్యాగును మాయం చేసి సెల్‌ఫోన్లు తీసుకొని పారిపోయినట్లు నిర్ధారించారు. ముందు జాగ్రత్తగా ఎలాంటి ఆధారాలు లేకుండా హత్య చేసినప్పటికీ పోలీసులు సవాల్‌గా తీసుకుని సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ మృతులు, నిందితులను గుర్తించారు. మరో 24 గంటల్లో నిందితులను ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుంటుందని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. 

పాత నేరస్తులు..
ఇద్దరిని హత్య చేసింది పాత నేరస్తులైన అమేర్, అజీమ్‌ అని పోలీసులకు లభించిన ఆధారాల ఫలితంగా నిర్ధారించారు. సెల్‌ఫోన్‌ దొంగతనాలతోపాటు పోలీస్‌ అధికారుల ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన నేర చరిత్ర వారిది. కొన్ని చోరీ కేసులు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదని తెలిసింది. 

మరిన్ని వార్తలు